ప్రధాని నెమళ్లతో బిజీగా ఉన్నారు..రాహుల్‌

లక్షలాది మంది ఉద్యోగాలు కోల్పోయారు

rahul-gandhi

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ ప్రధాని మోడిపై మరోసారి మండిపడ్డారు. మోడి ప్రజల ప్రాణాలను పట్టించుకోకుండా నెమళ్లతో బిజీగా ఉన్నారని ఎద్దేవా చేశారు. దేశంలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్న నేపథ్యంలో, ప్రజలు ఎవరి ప్రాణాలను వారే కాపాడుకోవాలని అన్నారు. ఈ వారంలో మన దేశంలో కరోనా కేసుల సంఖ్య 50 లక్షలకు చేరుకుంటుందని… యాక్టివ్ కేసులు 10 లక్షలకు చేరుకుంటాయని చెప్పారు. అంతులేని అహంకారం ఉన్న ఒక వ్యక్తి… ఆలోచన లేకుండా తీసుకున్న లాక్ డౌన్ నిర్ణయమే వైరస్ విస్తరించడానికి కారణమని రాహుల్ అన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ఇదే సమయంలో తన నివాసంలో నెమళ్లతో మోడి గడిపిన వీడియోను షేర్ చేశారు. ఆలోచన లేకుండా విధించిన లాక్ డౌన్ తో ఎంతో మంది ప్రాణాలను కోల్పోయారని, లక్షలాది మంది ఉద్యోగాలను కోల్పోయారని అన్నారు.

మరోవైపు రాహుల్ ట్వీట్ పై బిజెపి  నేతలు అదే స్థాయిలో స్పందిస్తున్నారు. రాహుల్ డైలీ బేసిస్ లో మోడిపై ట్వీట్లు చేస్తున్నారని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ ఎద్దేవా చేశారు. ప్రజల కోసం కాంగ్రెస్ ఎలాంటి పని చేయడం లేదని, క్రమంగా ఒక్కొక్క నేతను కోల్పోతోందని… చివరకు అది ట్వీట్ల పార్టీగా మిగిలిపోతుందని అన్నారు. మరోవైపు, ఈరోజు ప్రారంభమైన పార్లమెంట్ సమావేశాలకు రాహుల్ గాంధీ దూరమయ్యారు. తన తల్లి సోనియాగాంధీ మెడికల్ చెకప్ కోసం ఆమెతో కలిసి ఆయన విదేశాలకు వెళ్లారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/