టెక్సాస్ స్కూల్ లో కాల్పులు..నా కుమారుడిని క్షమించండి: బాలుడి తల్లి

దయచేసి అతడి చర్యను జడ్జ్ చేయవద్దని కోరిన తల్లి
కుమారుడి పనికి తాను క్షమాపణలు చెబుతున్నానన్న తండ్రి

వాషింగ్టన్: అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం యువాల్డేలోని రాబ్ ఎలిమెంటరీ స్కూల్లో 19 మంది విద్యార్థులు, ఇద్దరు టీచర్లను 18 ఏళ్ల బాలుడు సాల్వడార్ రామోస్ తుపాకీతో మట్టుబెట్టడం తెలిసిందే. పోలీసుల కాల్పుల్లో రామోస్ కూడా మరణించాడు. దీనిపై సాల్వడార్ రామోస్ కన్నతల్లి అడ్రినా మార్టినెజ్ స్పందించారు. ఓ టీవీ చానల్ తో ఆమె మాట్లాడుతూ.. ‘‘నన్ను క్షమించండి. నా కుమారుడిని కూడా క్షమించండి. నా కొడుకు చేసిన పనికి అతడి వైపు నుంచి కారణాలు ఉన్నాయి. అది నాకు తెలుసు. దయచేసి అతడి చర్యను జడ్జ్ చేయవద్దు. ప్రాణాలు కోల్పోయిన అమాయక చిన్నారులు క్షమించాలనే నేను వేడుకుంటున్నాను’’ అని పేర్కొన్నారు.

అంతమందిని కాల్చి చంపడానికి కారణాలు ఏమున్నాయి? అని టీవీ ప్రతినిధి ప్రశ్నించారు. దీనికి ఆమె సరైన సమాధానం ఇవ్వలేదు. సదరు నరహంతక బాలుడి తండ్రి స్పందిస్తూ.. ‘‘నా కుమారుడు చేసిన దానికి నేను క్షమాపణలు చెబుతున్నాను. నా కొడుకు ఎప్పుడూ కూడా ఇలాంటి చర్యకు దిగుతాడని ఊహించనే లేదు. అతడు అలాంటి పని చేయడానికి బదులు నన్ను చంపి ఉండాల్సింది. కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన చిన్నారులను వారి తల్లిదండ్రులు ఎలా అయితే ఇక ఎప్పుడూ చూడలేరో.. నేను కూడా నా కొడుకును ఇంకెప్పుడూ చూడలేను. అదే నాకు బాధ కలిగిస్తోంది’’ అని పేర్కొన్నాడు. స్కూల్లో కాల్పులకు దిగడానికి ముందు సదరు బాలుడు ఇంటి వద్ద అమ్మమ్మపైనా తుపాకీతో విరుచుకుపడడం తెలిసిందే.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/movies/