ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకింగ్‌ రంగంలో కొలువులు

అందుబాటులో పలు హోదాలు _ప్రాధాన్యం

Career Guidence
Career Guidence

ప్రస్తుత కార్పొరేట్‌ ప్రపంచంలో సంస్థల విలీనాలు, టెకోవర్లు, షేర్ల బై బ్యాక్‌లు, స్టాక్‌ మార్కెట్‌ లిస్టింగ్స్‌ తదితరాలు సర్వసాధారణమవుతున్నాయి. ఈ పరిణామమే ఇప్పుడు ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకింగ్‌ విభాగం అభివృద్ధికి, తద్వారా కొత్త కొలువుల ఆవిష్కరణకు కారణమవుతోంది. ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకింగ్‌ వాస్తవానికి బ్యాంకింగ్‌ రంగంలో అంతర్భాగమే.

కానీ, కార్యకలాపాల్లో వైవిధ్యం కారణంగా దీన్ని ప్రత్యేక విభాగంగా పేర్కొంటున్నారు. కార్పొరేట్‌ ప్రపంచంలో ఓ సంస్థను మరో సంస్థ కొనుగోలు చేయడం, రెండు సంస్థలు విలీనం కావడం, వాటాలు తీసుకోవడం వంటివి జరుగుతుంటాయి. ఈ క్రమంలో ఓ సంస్థను ఎంతగా కొనుగోలు చేయొచ్చు? ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫరింగ్‌ (ఐపివో) పరంగా ఎంత ధరను నిర్ణయించొచ్చు? తదితర అంశాలకు సంబంధించి కంపెనీలు..అనుభవమున్న బ్యాంకింగ్‌, కన్సల్టింగ్‌ సంస్థలపై ఆధారపడుతున్నాయి.

వీటిలోని ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకింగ్‌ నిపుణులు క్లయింట్లకు అవసరమైన సలహాలు ఇస్తారు. ఉదారహణకు ఎబిసి అనే సంస్థ ఎక్స్‌వైజెడ్‌ అనే సంస్థలో కొంత వాటాను కొనుగోలు చేయాలనుకుంది. ఈ క్రమంలో బ్రోకరేజ్‌/మీడియేషన్‌ సంస్థగా ఓ బ్యాంకును ఎంపిక చేసుకుంది. ఇందులోని ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకింగ్‌ విభాగం నిధుల సమీకరణ విషయంలోనూ సంస్థలకు సహకరిస్తాయి.

పెరిగిన ప్రాధాన్యం:

ఇటీవల కాలంలో భారత్‌లో ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకింగ్‌కు ప్రాధాన్యం పెరుగుతోంది. క్రెడిట్‌ స్కూప్‌ సంస్థ ప్రతినిధులు 2017, 2018 సంవత్సరాలను దేశంలో ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకింగ్‌కు స్వర్ణయుగంగా పేర్కొన్నారు. వచ్చే మూడు నాలుగేళ్లలో ఇదేధోరణి కొనసాగుతుందని స్పష్టం చేశారు. దీనికి కారణం గత రెండేళ్లుగా దేశంలో విలీనాలు, టెకోవర్లు, ఐపివోల జారీ వంటివి గణనీయంగా పెరగడమే.

ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకింగ్‌ విభాగంలో ప్రస్తుతం పలు హోదాలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రధానమైనది -ఫైనాన్షియల్‌ అనలిస్ట్‌, అనలిస్ట్‌, అసోసియేట్‌, రిస్క్‌ మేనేజర్‌, పోర్ట్‌ఫోలియో మేనేజర్స్‌, ఈ హోదాల్లోని వ్యక్తుల విధులు ఓ సంస్థకు సంబంధించిన మార్కెట్‌ విలువను లెక్కించడం, నిధుల సమీకరణ వ్యూహాలు రూపొందించడంపైనే ఉంటాయి.

కామర్స్‌, మేనేజ్‌మెంట్‌కు అనుకూలం:

ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకింగ్‌లోని కార్యకలాపాలను పరిగణనలోకి తీసుకుంటే ఇందులో లభించే హోదాలు కామర్స్‌, ఫైనాన్స్‌ మేనేజ్‌మెంట్‌ గ్రాడ్యుయేట్లకు అనుకూలంగా ఉంటున్నాయని చెప్పొచ్చు. అకడమిక్‌గా అనలిటికల్‌ స్కిల్స్‌, రిస్క్‌ స్ట్రాటజీస్‌ వంటి అంశాలపై అవగాహన ఉండటం దీనికి కారణం.

కామర్స్‌, ఫైనాన్స్‌ మేనేజ్‌మెంట్‌ గ్రాడ్యుయేట్లకు ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకింగ్‌లో ఎంట్రీ లెవల్‌లో అసోసియేట్‌ హోదాతో సంస్థలు అవకాశం కల్పిస్తున్నాయి. వీరు ఆయా సంస్థల్లో అనలిస్ట్‌లు, రిస్క్‌, మేనేజర్లకు సహాయకులుగా విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.

క్యాంపస్‌ నియామకాలు:

ప్రస్తుతం వాణిజ్యరంగంలో వేగంగా మారుతున్న పరిస్థితుల నేపధ్యంలో ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకింగ్‌లో మానవ వనరులకు డిమాండ్‌ పెరుగుతోంది. ఈ క్రమంలో బ్యాంకులు, ఫైనాన్షియల్‌ కన్సల్టింగ్‌ సంస్థలు ప్రముఖ బిస్కూళ్లలో క్యాంపస్‌ రిక్రూట్‌మెంట్‌ డ్రైవ్స్‌ ద్వారా నియామకాలు చేపడుతు న్నాయి. ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకింగ్‌ లో క్యాంపస్‌ ఆఫర్స్‌, వేతనాల పరంగా ఈ ఏడాది ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ (ఐఐఎం)ల్లో దాదాపు 20శాతం వృద్ధి నమోదైంది.

బోస్టన్‌ కన్సల్టింగ్‌ గ్రూప్‌, జెపి మోర్గాన్‌ చేజ్‌, అవెండస్‌, డెలాయిట్‌, గోల్డ్‌మన్‌శాచ్‌ వంటి సంస్థలు దాదాపు 200కు పైగా ఆఫర్లు అందించాయి. ఈ సంస్థలు ఎక్స్‌ఎల్‌ఆర్‌ఐ, ఎండిఐ-గుర్‌రావ్‌ వంటి ఇతర ప్రముఖ బి-స్కూల్స్‌లో సైతం ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకింగ్‌ జాబ్స్‌ను ఆఫర్‌ చేయడమే ఈ విభాగానికి పెరుగుతున్న డిమాండ్‌కు నిదర్శనం.

ప్రస్తుత పరిస్థితుల్లో డేటా అనలిటిక్స్‌లో పట్టున విద్యార్థులకు ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకింగ్‌లో మంచి ఆఫర్లు లభిస్తున్నాయి.

ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకింగ్‌ కొలువులకు సంబంధించి అకడమిక్‌ నైపుణ్యాలు, సర్టిఫికెట్లతోపాటు మరికొన్ని ఇతర నైపుణ్యాలు ప్రస్తుతం కీలకంగా మారాయి.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/