చట్టం పరిధిలోనే బుల్డోజర్ కూల్చివేతలు: యూపీ ప్రభుత్వం

సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు

pil-against-bulldozer-justice-filed-to-mislead-court-up-govt-tells-sc

న్యూఢిల్లీః ఉత్తరప్రదేశ్ సర్కార్‌ బుల్డోజర్ల ద్వారా చట్టవిరుద్ధమైన కట్టడాలను కూల్చివేయడాన్ని సమర్థించుకుంది. ప్రభుత్వ చర్యను వ్యతిరేకిస్తూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంలో (పిల్) బుధవారం తాజా అఫిడవిట్ సమర్పించింది. రాష్ట్రంలో అక్రమ నిర్మాణాలను చట్టబద్ధంగానే కూల్చివేస్తున్నట్టు స్పష్టం చేసింది. దీన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిల్స్ కోర్టులను తప్పుదోవ పట్టించడమేనని పేర్కొంది.

ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్న వారు, దాన్ని కాపాడుకునేందుకు ప్రాక్సీ లిటిగేషన్ మార్గాన్ని ఎంపిక చేసుకున్నట్టు యూపీ సర్కారు కోర్టు దృష్టికి తీసుకు వచ్చింది. మహమ్మద్ ప్రవక్తకు వ్యతిరేకంగా బీజేపీ మాజీ నేతలు చేసిన వ్యాఖ్యల తర్వాత యూపీలోని ప్రయాగ్ రాజ్, కాన్పూర్, సహరాన్ పూర్ తదితర ప్రాంతాల్లో అల్లర్లు చోటు చేసుకున్నాయి. ఈ కార్యక్రమంలో సూత్రధారులు, పాత్రధారుల ఇళ్లను అధికార యంత్రాంగం అక్రమంగా కూల్చేస్తోందని ఆరోపిస్తూ జమాతే ఉలేమా ఇ హింద్ ఈ వ్యాజ్యం వేసింది.

కాన్పూర్ జిల్లాలో నేరస్థులు, నిందితులకు సంబంధించి నివాస లేదా వాణిజ్య నిర్మాణాలపై చర్యలు చేపట్టవద్దంటూ ఆదేశాలు జారీ చేయాలని పిటిషనర్ కోరారు. కానీ, సహరాన్ పూర్ లో నిర్మాణాల కూల్చివేత చట్టబద్ధమేనని యూపీ సర్కారు అఫిడవిట్ లో పేర్కొంది. ప్రయాగ్ రాజ్ కూల్చివేత కేసు అలహాబాద్ హైకోర్టు ముందు విచారణలో ఉందని తెలియజేస్తూ, దీనిపై సుప్రీంకోర్టు విచారణ అవసరం లేదని పేర్కొంది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/telangana/