ఐశ్వ‌ర్యా రాయ్ బ‌చ్చ‌న్‌కు ఈడీ నోటీసులు

ప‌నామా ప‌త్రాల లీకేజీ వ్య‌వ‌హారంలో స‌మ‌న్లు
నేడు విచార‌ణ‌కు హాజ‌రుకావాల‌ని పిలుపు

ముంబయి: ప‌నామా ప‌త్రాల లీకేజీ వ్య‌వ‌హారంలో ఐశ్వ‌ర్యా రాయ్ బ‌చ్చ‌న్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ (ఈడీ) నుంచి నోటీసులు అందాయి. ఈ రోజు ఢిల్లీలోని ఈడీ కేంద్ర కార్యాల‌యానికి వ‌చ్చి, తమ ఎదుట విచార‌ణ‌కు హాజరు కావాలని ఈడీ ఆదేశించింది. అయితే, తాను ఈ రోజు విచార‌ణ‌కు రాలేన‌ని, విచార‌ణ‌ను మ‌రో తేదీకి మార్చాల‌ని ఐశ్వ‌ర్యా రాయ్ ఈడీని కోరిన‌ట్లు తెలిసింది. దీనిపై ఈడీ స్పందించాల్సి ఉంది. ఐశ్వ‌ర్యా రాయ్‌ను ఏయే ప్ర‌శ్న‌లు అడ‌గాల‌న్న అంశంపై ఈడీ అధికారులు జాబితాను సిద్ధం చేశారు.ప‌నామా కేసులో ఐశ్వ‌ర్య‌ స్టేట్‌మెంట్‌ను ఈడీ రికార్డు చేసుకోనుంది. ఐశ్వ‌ర్యా రాయ్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ గ‌తంలోనూ స‌మ‌న్లు జారీ చేయ‌గా, ఆమె రెండు సార్లు విచార‌ణ తేదీల‌ను మార్చాల‌ని కోరిన‌ట్లు తెలిసింది.

ఇప్ప‌టికే ఐశ్వ‌ర్య భ‌ర్త‌ అభిషేక్‌ బచ్చన్‌కు కూడా ఈడీ సమన‍్లు జారీ చేసి, విచారించిన విష‌యం తెలిసిందే. ఈడీ అధికారులకు అభిషేక్ బ‌చ్చ‌న్ ఆ స‌మ‌యంలో కొన్ని పత్రాలను కూడా అందజేసినట్లు సమాచారం. ఇప్పుడు ఈడీ అధికారులు ఐశ్వర్య రాయ్‌కు కూడా సమన్లు గ‌మ‌నార్హం. అమితాబ్ బ‌చ్చ‌న్ కుటుంబం కూడా ప‌నామా కేసులో విచార‌ణ ఎదుర్కొంటుండ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. కాగా, ఐదేళ్ల క్రితం నాటి పనామా పేపర్స్ లీకేజీతో బ‌య‌ట‌ప‌డిన అవినీతిదారుల బాగోతంలో భారత్ నుంచి సుమారు 500 మంది ఉన్నట్లు సమాచారం. దేశంలో ప్ర‌ముఖ వ్యాపార‌వేత్త‌లు, రాజ‌కీయ‌ నాయకులు, సినీనటులు, క్రీడాకారులు కూడా ఉన్నారు. పన్ను ఎగవేతకు పాల్పడినట్లు వారిపై ఆరోపణలు ఉన్నాయి. పనామా పేపర్ల ద్వారా బ‌య‌ట‌ప‌డిన వీరి బాగోతంపై సుదీర్ఘ‌ విచారణ కొన‌సాగుతోంది. ఇప్ప‌టికే ఈడీ అధికారులు దేశంలోని పలువురు ప్రముఖులను విచారణలో చేర్చిన విష‌యం తెలిసిందే.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/international-news/