క్రిస్మస్‌కు ముందే ఫైజర్‌ టీకా పంపిణీ!

ఎఫ్డీఏ అనుమతి లభించడమే ఆలస్యమన్న బయో ఎన్ టెక్

pfizer-vaccine

న్యూయార్క్‌: ఫైజర్‌ -బయోఎన్‌టెక్‌ సంస్థలు సంయుక్తంగా అభివృద్ధి చేసిన టీకా వచ్చే నెలలో అందుబాటులోకి వచ్చే అవకాశాలు కన్పిస్తున్నాయి. క్రిస్మస్ కు ముందే ఫైజర్ వ్యాక్సిన్ ను ప్రజలకు అందుబాటులోకి తీసుకుని రావాలని ఫైజర్ భావిస్తోంది. వ్యాక్సిన్ 95 శాతం విజయవంతం అవుతోందని తేలిన నేపథ్యంలో తక్షణమే యూఎస్, యూరప్ హెల్త్ ఆర్గనైజేషన్స్ నుంచి అనుమతులు తీసుకుని ఈ వ్యాక్సిన్ ను మార్కెట్లోకి పంపాలని భావిస్తోంది. ఈ వ్యాక్సిన్ తీసుకున్న వారిలో ఎటువంటి దుష్ప్రభావాలు లేవని తేలిన నేపథ్యంలో, వెంటనే అనుమతించాలని కోరుతూ యూఎస్ ఎఫ్డీఏను ఫైజర్ అభ్యర్థించనుంది.

ఈ వ్యాక్సిన్ ను అన్ని రకాల వయసుల వారికీ ఇచ్చి పరీక్షించగా, చెప్పుకోతగ్గ దుష్ప్రభావాలు నమోదుకాలేదు. వయో వృద్ధులకు, 14 ఏళ్లలోపు చిన్నారులకు కూడా వ్యాక్సిన్ ఇచ్చారు. వారిలోనూ సైడ్ ఎఫెక్ట్ లు రాలేదని సంస్థ వర్గాలు ప్రకటించాయి. ఇక యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ సైతం ఈ వ్యాక్సిన్ పై ఆశాజనకంగా ఉంది. డిసెంబర్ రెండో వారం నుంచే వ్యాక్సిన్ ప్రజలకు అందుతుందని బయో ఎన్ టెక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఉగర్ సాహిన్ రాయిటర్స్ టీవీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో వెల్లడించారు. అయితే, ఇందుకు ప్రభుత్వ అనుమతి తప్పనిసరని ఆయన అన్నారు.

కాగా, తమ టీకా మూడో దశ క్లినికల్‌ ట్రయల్స్‌లో 95 శాతం ప్రభావవంతంగా పనిచేసిందని బుధవారం ఫైజ‌ర్‌ వెల్లడించింది. జర్మనీ సంస్థ బయోఎన్‌టెక్‌తో కలిసి తయారు చేసిన ఈ టీకా తుది ప్రయోగ ఫలితాలను ఫైజర్‌ ప్రకటించింది.


తాజా వీడియోస్‌ కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/videos/