నేడు మరోసారి పలు రాష్ట్రాల్లో ఎన్ఐఏ సోదాలు

pfi-faces-second-round-of-raids-across-states

న్యూఢిల్లీః ఉగ్రవాద రిక్రూట్‌మెంట్ సంస్థ పీఎఫ్ఐ.. దేశంలో జరగనున్న దసరా ఉత్సవాల్లో ఉగ్రదాడులకు కుట్ర పన్నుతున్నట్లు తెలుస్తోంది. పీఎఫ్ఐ సభ్యులు కొందరిని ఎన్ఐఏ అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ విచారణలోనే షాకింగ్ విషయాలు వెలుగు చూశాయి. దసరా సమయంలో బిజెపి, ఆర్ఎస్ఎస్ టార్గెట్‌గా ఉగ్రదాడులు చేయాలని పీఎఫ్ఐ ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా, పీఎఫ్ఐ, దాని అనుబంధ సంస్థలపై మరోసారి ఎన్ఐఏ తనిఖీలు చేస్తోంది. పీఎఫ్ఐ సంస్థతో సంబంధం ఉన్న అనేక మంది సభ్యులు, సంస్థ కార్యాలయాలపై కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ, ఈడీ మరోసారి సంయుక్తంగా తనిఖీలు నిర్వహించాయి. మొత్తం 8 రాష్ట్రాల్లో పలుచోట్ల రెండు దర్యాప్తు సంస్థలు సంయుక్తంగా దాడులు నిర్వహిస్తున్నాయి.

ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, పంజాబ్, ఢిల్లీ, కేరళ, గుజరాత్, కర్ణాటక, అస్సాంలో దాడులు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈరోజు ఆపరేషన్‌లో సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఐబీ, రాష్ట్ర పోలీసులు కూడా కొన్ని చోట్ల పాలుపంచుకున్నట్లు ఎన్ఐఏ కేంద్ర కార్యాలయం తెలిపింది. ఎన్ఐఏ, ఇతర దర్యాప్తు సంస్థలు ఇలా దేశంలో ఉన్న పీఎఫ్ఐ కార్యకలాపాలపై దాడులు నిర్వహించడం గత రెండు వారాల్లో ఇది మూడోసారి కావడం గమనార్హం.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/andhra-pradesh/