PFI నిషేధం ఫై అసదుద్దీన్ ఒవైసీ కీలక ట్వీట్స్

ఉగ్ర కార్యకలాపాలకు నిధుల సమీకరణతో పాటు భారత్ లో మతకల్లోలాలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్న పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాపై కేంద్ర సర్కార్ నిషేధం విధించిన సంగతి తెలిసిందే. పీఎఫ్ఐ సహా దాని అనుబంధ సంస్థలను ఐదేళ్ల పాటు బ్యాన్ చేసింది. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని పేర్కొంది. ఈ క్రమంలో PFI నిషేధంపై ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ కీలక ట్వీట్స్ చేశారు.
తాను ఎల్లప్పుడూ PFI విధానాన్ని వ్యతిరేకిస్తూ, ప్రజాస్వామ్య విధానాన్ని సమర్ధిస్తూనే ఉన్నానని స్పష్టం చేశారు. కానీ.. PFIపై నిషేధానికి మాత్రం మద్దతు ఇవ్వలేమని ట్వీట్ చేశారు. ఈ రకమైన నిషేధం ప్రమాదకరం అని ఆందోళన వ్యక్తం చేశారు. ఎందుకంటే.. ఈ నిషేధం తన అభిప్రాయాన్ని చెప్పాలనుకునే ముస్లింపై నిషేధం లాంటిదని వ్యాఖ్యానించారు. అటు UAPA చట్టంపైనా ఒవైసీ తీవ్ర ఆరోపణలు చేశారు. UAPA ఆధారంగా తీసుకున్న చర్యలను ఎప్పుడూ వ్యతిరేకిస్తానని చెప్పారు. ఇది రాజ్యాంగం ప్రాథమిక సూత్రాల్లో భాగమైన స్వేచ్ఛకు విరుద్ధంగా నడుస్తుందని ఆరోపించారు. UAPAని కఠినతరం చేయడానికి కాంగ్రెస్ సవరణ చేసిందని.. దాన్ని ప్రస్తుత ప్రభుత్వం మరింత కఠినంగా మార్చడానికి ప్రయత్నాలు చేస్తోందని వివరించారు.