25 నుంచి జ‌ర‌గాల్సిన ఇంట‌ర్ ఎగ్జామ్స్‌ ర‌ద్దు చేయాలి: హైకోర్టులో పిటిష‌న్

ప‌రీక్ష‌లు రాయ‌కుండానే ప్ర‌స్తుతం రెండో ఏడాది చ‌దువుతోన్న‌ విద్యార్థులు
వారికి మొద‌టి ఏడాది ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌వ‌ద్ద‌ని పిటిష‌న్

హైదరాబాద్: తెలంగాణ‌లో ఇంటర్మీడియట్‌ ప్రథమ సంవత్సర పరీక్షలు ఈ నెల‌ 25వ తేదీ నుంచి జరగనున్న విష‌యం తెలిసిందే. గ‌త‌ విద్యా సంవత్సరంలో ఇంటర్ ప‌రీక్ష‌లు ర‌ద్ద‌య్యాయి. అప్ప‌టి ప్రథమ సంవత్సరం విద్యార్థులు ప్రస్తుతం ద్వితీయ సంవత్సరం చదువుతున్నారు. క‌రోనా కార‌ణంగా ప‌రీక్ష‌లు రాయ‌కుండానే వారు ప్ర‌మోట్ అయ్యారు. అయితే, 70 శాతం సిలబస్ తో వారికే ఈ సారి ప్ర‌థ‌మ ఏడాది పరీక్షలు నిర్వహించనున్నారు. వారికి ప‌రీక్ష‌లు నిర్వహించాల‌ని ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యానికి వ్య‌తిరేకంగా హైకోర్టులో పిటిష‌న్ దాఖ‌లైంది.

విద్యార్థుల‌ త‌ల్లిదండ్రుల సంఘం త‌ర‌ఫున న్యాయ‌వాది రాపోలు భాస్క‌ర్ హైకోర్టులో ఈ పిటిష‌న్ వేశారు. ఇప్ప‌టికే ప్ర‌మోట్ అయిన విద్యార్థుల‌కు ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌కూడ‌ద‌ని కోరారు. ప‌రీక్ష‌ల‌ను ర‌ద్దు చేసి విద్యార్థుల‌ను ఉత్తీర్ణులుగా ప్ర‌క‌టించాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు. ఇదిలా ఉండ‌గా, ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌కు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు. ఇప్ప‌టికే హాల్ టికెట్లు వెబ్‌సైట్ ద్వారా విద్యార్థులు డౌన్ లోడ్ చేసుకుంటున్నారు. ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌పై ప్ర‌స్తుతం జిల్లాల విద్యాధికారుల‌తో స‌బితా ఇంద్రారెడ్డి స‌మీక్ష స‌మావేశం నిర్వ‌హిస్తున్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/