అమెరికా అధ్యక్ష రేసులో భారత సంతతి వ్యక్తి

2024లో బైడెన్ నిలబడకుంటే రో ఖన్నాకు చాన్స్
డెమోక్రాట్లలో పెరిగిన మద్దతు

వాషింగ్టన్: ఇటీవలి కాలంలో అమెరికా రాజకీయాల్లో భారతీయులూ కీలకంగా మారారు. కీలక పదవులు దక్కించుకుంటున్నారు. గత ఎన్నికల్లో ఆ దేశ ఉపాధ్యక్షురాలుగా భారతీయ అమెరికన్ అయిన కమలా హారిస్ ఎన్నికైన సంగతి తెలిసిందే. అయితే భారతీయుడైన రో ఖన్నా అధ్యక్ష పదవికి రేసులో నిలిచారు. 2024 ఎన్నికల్లో ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ రెండో టర్మ్ కోసం పోటీ చేయకపోతే.. రో ఖన్నాను అధ్యక్షుడిగా బరిలోకి దించాలని బెర్నీ శాండర్స్ వర్గం పావులు కదుపుతోంది. ఇప్పటికే రో ఖన్నాకు మద్దతు కూడా ప్రకటించింది. ఇప్పటికే ఈ విషయంపై శాండర్స్ ప్రెసిడెన్షియల్ క్యాంపెయిన్ మేనేజర్ జెఫ్ వీవర్, శాండర్స్ సీనియర్ సలహాదారు మార్క్ లాంగాబా.. ఖన్నాతో చర్చించినట్టు తెలుస్తోంది.

అయితే, ఈ విషయంపై బహిరంగంగా చర్చించేందుకు డెమోక్రాట్ పార్టీ నేతలు ఇష్టపడడం లేదు. అయితే, బైడెన్ అనుకూల వర్గం మాత్రం.. ఆయన ఆరోగ్యం సహకరిస్తే రెండో సారి కూడా అధ్యక్ష రేసులో ఉంటారని అంటోంది. ఇటు కమలా హారిస్ కూడా అధ్యక్ష రేసులో ఉన్నా.. ఈసారి ఆమె కచ్చితంగా గెలవదని పార్టీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారట. ఇటు కొందరు డెమోక్రాట్ పార్టీ గవర్నర్లు, సెనేటర్లు, హౌస్ సభ్యులు బైడెన్ అభ్యర్థిత్వంపై ఇప్పటికే పెదవి విరుస్తున్నట్టు తెలుస్తోంది. ఆయనకు వయసు మీద పడిందని, ప్రస్తుతం 79 ఏళ్ల వయసున్న ఆయన.. మరో రెండేళ్లంటే 81 ఏళ్లకు వస్తారని చెబుతున్నారు. కాబట్టి ఆయనకు అవకాశం ఇవ్వకూడదని వారంతా ఒత్తిడి చేస్తున్నట్టు సమాచారం.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/