భారీ ఎత్తున ఉద్యోగులను తొలగిస్తున్న పెప్పీకో

అంతర్జాతీయ దిగ్గజసంస్థ అయిన పెప్సీకో..ఉద్యోగులకు షాక్ ఇచ్చింది. ప్రస్తుతం దిగ్గజ కంపెనీలన్నీ ఉద్యోగులను తగ్గించుకునే పనిలో పడ్డాయి. సోషల్‌ మీడియా దిగ్గజం ట్విట్టర్‌తో మొదలైన ఈ ట్రెండ్‌ ..ఇప్పుడు మిగతా సంస్థలు కూడా పాటిస్తున్నాయి. ప్రస్తుతం అమెజాన్‌, ఫేస్‌బుక్‌తో పాటు పలు కంపెనీలు లే ఆఫ్స్‌ను ప్రకటిస్తున్నాయి. తాజాగా ఈ జాబితాలో పెప్సికో కంపెనీ చేరింది.

తమ కంపెనీలో వందలాదిమంది తొలగించనున్నట్లు పెప్సీకో అంతర్గత మెమో జారీ చేసినట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ వెల్లడించింది.వచ్చే ఏడాది ప్రపంచం ఆర్థిక మాంద్యం ఎదుర్కొంటుందని ప్రపంచ బ్యాంక్ నివేదించిన నేపథ్యంలో పలు కంపెనీలు ఉద్యోగాల కోత ప్రారంభించాయి. అనిశ్చిత ఆర్థిక వాతావరణం, ద్రవ్యోల్బణం కారణంగా కంపెనీలు ఉద్యోగులను తొలగించి ఖర్చులు తగ్గించుకుంటున్నాయి.

2025 నాటికి దాదాపు 6 వేల మందిని తొలగిస్తామని హెచ్‌పీ ఇటీవల ప్రకటించగా, అమెజాన్ 20 వేల మందిని ఇంటికి పంపిస్తోంది. తొలుత 10 వేలమందిని తొలగిస్తున్నట్టు వార్తలు రాగా, ఆ తర్వాత ఆ సంఖ్య 20 వేలకు పెరిగింది. ఇందులో అన్ని గ్రేడ్ల ఉద్యోగులూ ఉన్నారు. ఫేస్‌బుక్‌లో దాదాపు 11 వేల మంది ఉద్యోగాలు కోల్పోయారు.