“గడప గడపకు ప్రభుత్వం” కార్యక్రమంలో నేతలకు షాకులు

గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పండుగలా ప్రారంభమైంది. అయితే ఈ కార్యక్రమంలో నేతలకు ప్రజల నుండి షాక్ లు ఎదురవుతున్నాయి. కర్నూలు జిల్లాలో పాల్గొన్న మంత్రి గుమ్మనూరు జయరామ్ కు ప్రజలు షాక్ ఇచ్చారు. వివిధ అంశాలపై ప్రజలు నిలదీశారు.
ఆలూరు- హత్తినబెళల్ ప్రధాన రహదారిని ఎప్పుడు నిర్మిస్తారో చెప్పాలని మంత్రిని నిలదీశారు. అమ్మ ఒడి డబ్బులు కూడా రావడం లేదని, అమ్మ ఒడి రాకపోయినా పర్లేదని, రోడ్డు మాత్రం వేయించాలని మంత్రిని డిమాండ్ చేశారు. అదే విధంగా మంచి నీటి సమస్యను కూడా పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
ఇక మరో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి కూడా ఇదే అనుభవం ఎదురైంది. తమకు రెండు నెలలుగా ఉపాధి హామీ పనుల డబ్బులు రావడం లేదని బేతంచెర్ల మండలంలో ప్రజలు నిలదీశారు. వెంటనే తమ డబ్బులు వచ్చేలా చూడాలని ప్రజలు డిమాండ్ చేశారు. దీంతో మంత్రి అధికారులను వెంటనే పిలిపించి, వివరణ కోరారు. వారం రోజుల్లోగా డబ్బులు వస్తాయని చెప్పి, వెళ్లిపోయారు.