పెన్షన్‌ భిక్షకాదు.. మానవ హక్కు

పెన్షన్‌కోసం వృద్ధుల అగచాట్లు

Pension holder-File
Pension holder-File

దేశ ఆర్థిక సామాజిక రంగం లో ఏ మార్పులు వచ్చినా దాని మూలాలు నూతన ఆర్థిక విధానాల విషఫలాలే.

ఈ రోజు దేశంలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య అయిన కాంట్రి బ్యూషన్‌ పెన్షన్‌ స్కీం (సిపిఎస్‌) కూడా ఆ నూతన ఆర్థిక విధానాల విష ఫలమే.

లిబరలైజేషన్‌, ప్రైవేటేజేషన్‌, గ్లోబలైజేషన్‌ వంటి నూతన ఆర్థిక విధానాల ద్వారా ప్రపంచ బ్యాంకు షరతులకు తలొగ్గి, కేంద్ర ప్రభుత్వం తెచ్చిన విధానమే ఈ కాంట్రిబ్యూషన్‌ పెన్షన్‌ స్కీం అన్నది బహిరంగ రహస్యం.

నూతన పెన్షన్‌ స్కీం అనేది భారత పార్లమెంట్‌ చట్టం ద్వారా సృష్టించబడిన పెన్షన్‌ ఫండ్‌ రెగ్యులేటరీ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఆథారిటీ చేత నియంత్రించబడే పెన్షన్‌ వ్యవస్థ.

జనవరి ఒకటి,2004 తర్వాత ఉద్యోగులకు పాత పెన్షన్‌ నిలిపివేయడానికి సిపిఎస్‌ ప్రారంభమైంది.

భారత ప్రభుత్వం 1999 సంవత్సరంలో ఓఎఎస్‌ఐయస్‌, ఐఆర్‌డిఏ, భట్టాచార్య కమిటీలను వివిధ విభాగ పెన్షన్‌ విధానాలను పరిశీలించడానికి నియమించింది.

ఆ కమిటీల సిఫారసుల ఆధారంగా నూతన పెన్షన్‌ వ్యవస్థను ఎన్‌డియే ప్రభుత్వం జనవరి ఒకటి, 2004లో అమలులోకి తెచ్చింది.

ఆయా రాష్ట్రాలు దీనిని స్వచ్ఛందంగానే ఎంచుకొనుటకు కేంద్ర ప్రభుత్వం అవకాశం ఇచ్చినప్పటికీ చాలా రాష్ట్రాలు ఎంపిక చేసుకోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది.

మన రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ కాలంలో ఈ విధానాన్ని ఎంపిక చేసుకొని 2004 సెప్టెంబర్‌ ఒకటిన జిఒఎంఎస్‌ నెంబర్‌ 653 ద్వారా అమల్లోకి తేవడం జరిగింది.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కొత్త తెలంగాణ ప్రభుత్వం కూడా జిఒఎంఎస్‌ నెంబర్‌ 28 ద్వారా కాంట్రిబ్యూషన్‌ పెన్షన్‌ స్కీంను అంగీకరిస్తూ అమల్లోకి తేవడం జరిగింది.

కాంట్రిబ్యూషన్‌ పెన్షన్‌ స్కీమ్‌ ప్రారంభంలో చాలా రాష్ట్రాలు ఒప్పుకొన్నప్పటికీ వామపక్ష ప్రభుత్వంగల వెస్ట్‌ బెంగాల్‌, త్రిపుర, కేరళ రాష్ట్రాలు మాత్రం దీనికి అంగీకరించలేవు.

కేరళలో కాంగ్రెస్‌ ప్రభుత్వం, త్రిపురలో బిజెపి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఈ విధానాన్ని అమలులోకి తెచ్చాయి. పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్‌ కాంగ్రెస్‌ ఈ విధానాన్ని ఒప్పుకోలేదు.

పాతపెన్షన్‌ వల్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ ఆదాయంలో పెద్దమొత్తంగా జీతభత్యాల కోసం ఖర్చు చేయాల్సి వస్తుందని వాటిని తగ్గించాలనే ఉద్దేశ్యంతో ఈ నూతన పెన్షన్‌ విధానాన్ని తెచ్చే ప్రయత్నం చేశాయని చెప్పిన్పటికీ అసలు ఉద్దేశం మాత్రం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్‌ విధానంలో దాచుకున్న డబ్బును బడా కార్పొరేట్‌ సంస్థలకు పెట్టుబడిగా మార్చే ఉద్దేశ్యం దాగి ఉందని అర్థమవుతుంది.

మార్చి 2019 నాటికి 1.24 కోట్ల మంది చందాదారులు ఈ పెన్షన్‌లో చేరారు. మార్చి 2019 నాటికి ఎన్‌పిఎస్‌ ఆస్తులు మూడు లక్షల పదకొండువేల మూడు వందల యాభై నాలుగు కోట్లు. చందాదారుల్లో 35 శాతం అకౌంటులో 88 శాతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల వాట ఉంది.

నూతన పెన్షన్‌ విధానంలో ఉద్యోగికి ఎంత పెన్షన్‌ వస్తుంది అనే విషయంపైన స్పష్టత లేదు. పిఎఫ్‌ఆర్‌డిఎ యాక్ట్‌ 2013 సెక్షన్‌ 20లో పెన్షన్‌ ఎంత వస్తుందో మార్కెట్‌ నిర్ణయిస్తుందని పేర్కొంటుందంటే .

30 సంవత్సరాలకుపైగా ప్రభుత్వ సేవలో ఉన్న వ్యక్తికి ప్రభుత్వం ఇచ్చే బహుమానం ఇదేనా? దేవకినందన్‌ నకర కేసుల్లో సుప్రీంకోర్టు పెన్షన్‌ భిక్షకాదని జీవితకాలం పనిచేసినందుకు పొందే మానవ హక్కు అని పేర్కొంది.

పెన్షన్‌ పై ఫోర్త్‌ పే కమిషన్‌, అనుకోకుండా (మరణం) జరిగినా, అనుకోని (వృద్ధ్యాప్యం) జరిగే సంఘటనలకు సామాజిక భద్రత కల్పించడమే పెన్షన్‌ ముఖ్య లక్ష్యంగా పేర్కొంది.

భారత రాజ్యాంగం ఆర్టికల్‌ 41 సామాజిక భద్రత కల్పించాలని పేర్కొంటోంది.

ఆర్టికల్‌ 14 పౌరుల మధ్య సమానత్వం గురించి పేర్కొంటుంది. ఈ విధంగా రాజ్యాంగంలో పేర్కొన్న సామాజిక భద్రత, సమానత్వం అనే విషయాలను ఈ నూతన పెన్షన్‌ విధానం ఉల్లంఘిస్తుంది.

పెన్షన్‌కు భారీగా ఖర్చువుతుందని అంటున్న ప్రభుత్వాలు సంవత్సరానికి వేల కోట్ల రూపాయలు కార్పొరేట్‌ సంస్థలకు రాయితీ రూపంలో ఇస్తున్న విషయాన్ని ఒకసారి గుర్తు చేసుకోవాలి.

ప్రస్తుతం ఉన్న నూతన పెన్షన్‌ (సిపిఎస్‌)లో వారి పెన్షన్‌ను మార్కెట్‌ నిర్ణయిస్తుంది. అంతర్జాతీయ మార్కెట్‌ ఒడిదుడుకులకు లోబడి నెలనెలా పెన్షన్‌ మారుతూ వృద్ధ్యాప్యంలో వారి ఆర్థికభద్రత గాలిలో దీపంగా మార్చుతుంది.

సుమారు 30 సంవత్సరాలు ప్రభుత్వ సేవలో ఉన్న వారికి ప్రభుత్వం ఇచ్చే గౌరవం ఇదేనా? మార్కెట్‌పై ఆధారపడ్డ నూతన పెన్షన్‌ వృద్ధాప్యంలో వారికి ఎలా తోడ్పడుతుంది?

ఉద్యోగుల వాటా, ప్రభుత్వ వాటా మొత్తం స్టాక్‌ మార్కెట్‌లో పెడితే, వారి బతుకులు భద్రత లేని బతుకులు కావా? వ

్యవస్థీకృత రంగంలో అందులో ప్రభుత్వంలో సేవలందించిన వారి వృద్ధాప్య బతుకులను మార్కెట్‌ జూదానికి వదిలిపెట్టడం ప్రభుత్వానికి సమంజసమా? ప్రభుత్వాలు తెచ్చిన ఈ విధానం వల్ల పదవి విరమణ చేసినవారు గౌరవంగా ఎలా బతుకగలరు?

ఈ మధ్యనే పదవీ విరమణ చేసినవారి నూతన పెన్షన్‌ (సిపిఎస్‌) ఆసరా పెన్షన్‌ కన్నా అధ్వాన్నంగా ఉంది.

రాజకీయ నాయకులకు ఒకటి, రెండుసార్ల పదవిలో ఉంటేనే పెన్షన్‌ ఇస్తున్నప్పుడు 30 సంవత్సరాలు ప్రభుత్వ సేవలో ఉన్న ఉద్యోగులకు వృద్ధాప్యంలో ఇచ్చే గుర్తింపు ఇదేనా?

పెన్షన్‌ లెక్కలను లాభనష్టాలతో చూడడానికి ప్రభుత్వం ఏమైనా వ్యాపార సంస్థనా? పెన్షన్‌ అనేది ఉద్యోగి ప్రాథమిక హక్కుగా సుప్రీంకోర్టు పేర్కొంది. పెన్షన్‌కు దూరం చేయడం అంటే వ్యక్తి జీవించే హక్కును కాలరాయడమే.

  • జుర్రు నారాయణ యాదవ్‌

తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/