వేతన జీవులకి శుభవార్త

pension
pension

హైదరబాద్‌: ప్రైవేటు రంగంలో పనిచేస్తున్న ఉద్యోగులు, కార్మికులు పదవీవిరమణ సమయంలో అధిక పింఛను పొందేందుకు సుప్రీంకోర్టు వీలుకల్పించింది. గతంలో కేరళ హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ.. ఈపీఎఫ్‌వో దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగొయి, న్యాయమూర్తులు జస్టిస్‌ దీపక్‌గుప్తా, జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నాలతో కూడిన ధర్మాసనం తోసిపుచ్చింది. దీంతో ఇకనుంచి ఉద్యోగులు పదవీవిరమణ సమయానికి తీసుకునే చివరి సగటు వాస్తవిక మూలవేతనం, డీఏపై ఈపీఎఫ్‌ పింఛను లెక్కించేందుకు మార్గం సుగమమయింది. అధిక పింఛను కోసం ఉద్యోగి, యజమాని సంయుక్తంగా ఆప్షన్‌ ఇవ్వాలని సూచించింది. దీనికి గడువేమీ లేదని తేల్చిచెప్పింది. ఈ తీర్పుతో ఈపీఎఫ్‌ పరిధిలో వేతన జీవులకు వారు పొందుతున్న వేతనాల మేరకు పింఛను లభించనుంది.ఈపీఎఫ్‌వో చట్టంలోని పేరా 11(3) ప్రకారం.. ఉద్యోగి వేతనం రూ.6,500 కంటే ఎక్కువగా ఉంటే, ఆ వేతనంపై ఈపీఎస్‌ చెల్లించేందుకు అనుమతి ఉంటుంది.

పింఛను ఇలా లెక్కిస్తారు

ఇక ఉద్యోగి వాస్తవిక మూలవేతనం, డీఏ కలిపి పింఛను గరిష్ఠ అర్హత వేతనంగా నిర్ణయించాలి. ఆ ఉద్యోగి సర్వీసు ఆధారంగా పింఛను లెక్కించాలి. ఒకవేళ ఉద్యోగి 20 ఏళ్ల సర్వీసు పూర్తి చేసుకుంటే.. వారికి అదనంగా మరో రెండేళ్ల సర్వీసు కలిసి వస్తుంది.

పింఛను లెక్కింపు సూత్రం: గరిష్ఠ అర్హత వేతనం సర్వీసు/70

ఉదాహరణకు పాత పద్ధతిలో.. ఒక ఉద్యోగి పదవీ విరమణ వేతనం రూ.35 వేలు అనుకుందాం. సర్వీసు 22 ఏళ్లు. ప్రస్తుత గరిష్ఠ అర్హత వేతన పరిమితి రూ.15 వేలు ఉన్నందున ఉద్యోగికి పింఛను లెక్కిస్తే రూ.4,714 వస్తుంది. రెండేళ్ల బోనస్‌ కలిపి 24 ఏళ్ల సర్వీసు అవుతుంది.
15,000 x 24/70  = రూ.5,142
సుప్రీం తీర్పు మేరకు వాస్తవిక వేతనంతో లెక్కించినపుడు..
35,000 x 24/70  = రూ.12,000
ఇలా వేతనం, సర్వీసు పెరిగే కొద్దీ.. పదవీవిరమణ తరువాత విశ్రాంత సమయంలో అందే పింఛను పెరుగుతుంది. ఇది అధిక వేతనాలతో పనిచేస్తున్న వారందరికీ ఊరటనిచ్చే విషయం.


మరిన్ని తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/