డెమొక్రాట్లకు పెలోసీ విజ్ఞప్తి

శాండర్స్‌కు పెరుగుతున్న ఆదరణ

Nancy Pelosi
Nancy Pelosi

వాషింగ్టన్‌: అమెరికన్‌ కాంగ్రెస్‌ ప్రతినిధుల సభ స్పీకర్‌ నాన్సీ పెలోసీ డెమొక్రాటిక్‌ పార్టీలో ఐక్యతను కాపాడాలని విజ్ఞప్తి చేశారు. అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాటిక్‌ పార్టీ అభ్యర్థిత్వం కోసం జరుగుతున్న పోరులో డెమొక్రాటిక్‌ సోషలిస్టు బెర్నీ శాండర్స్‌ ప్రైమరీస్‌, కాకసస్‌లలో వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. ఆయన విజయాన్ని చూసి ఓర్వలేని మిగతా డెమొక్రాటిక్‌ పార్టీ అభ్యర్థులు శాండర్స్‌ను లక్ష్యంగా చేసుకుని వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారు. ముఠా రాజకీయాలు నడుపుతున్నారు. పార్టీలో పెరుగుతున్న ఈ అనారోగ్యకర ధోరణులతో కలవరపడిన పెలోసీ ఈ విజ్ఞప్తి చేశారు. అధ్యక్ష అభ్యర్థిత్వం ఎవరికి దక్కుతుందన్నది సమస్య కాదని, అభ్యర్థిగా బరిలో నిలిచిన వ్యక్తికి మనం హృదయపూర్వకంగా సహకరిద్దామని ఆమె నేతలకు సూచించారు. ‘మనలో ఎటువంటి విభేదాలు వద్దు. మొత్తం ఐక్యంగా ముందుకు సాగడమే మనముందున్న కర్తవ్యం అని ఆమె ఉద్బోధించారు. శనివారం సౌత్‌ కరోలినా ప్రైమరీ, మార్చి 2న సూపర్‌ ట్యూజ్‌డే జరగనుండటంతో డెమొక్రాట్లు తమ యత్నాలను ముమ్మరం చేశారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/