వ్యాపార కేంద్రంగా తిరుమల..ఏపిలో కొత్త పార్టీ స్థాపిస్తాం: పీఠాధిపతులు

రాజకీయ నాయకులు, ధనవంతులకు మాత్రమే స్వేచ్ఛగా దర్శనం కలుగుతోందని ఆగ్రహం

తిరుమలః టిటిడిని వ్యాపార కేంద్రంగా మార్చారంటూ వివిధ రాష్ట్రాలకు చెందిన 30 మంది పీఠాధిపతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనార్థం వీరంతా తిరుమలకు వచ్చారు. ఈ సందర్భంగా తమను మహాద్వారం నుంచి దర్శనానికి పంపమని వారు కోరగా… తమకు ఎలాంటి సమాచారం లేదని అక్కడున్న భద్రతా సిబ్బంది చెప్పారు. తాము వస్తున్నట్టు ముందుగా లేఖ రాసినా ఇలా చేస్తారా? అంటూ వారు నిరసన వ్యక్తం చేశారు.

అనంతరం శ్రీనివాసం మంగాపురంలో వారు మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయవాడకు చెందిన శ్రీయోగిపీఠం అధిపతి శ్రీయోగి అతిథేశ్వరానంద పర్వతస్వామి మాట్లాడుతూ… తిరుమలను వ్యాపార కేంద్రంగా మార్చారని విమర్శించారు. తిరుమలలో కేవలం రాజకీయ నాయకులకు, ధనవంతులకు మాత్రమే శ్రీవారిని స్వేచ్ఛగా దర్శించుకునే అవకాశం కలుగుతోందని అన్నారు. సామాన్యులు చాలా ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు.

తిరుమలలో మార్పులు రాకపోతే అఖిల భారత హిందూ మహాసభ ద్వారా తమ భక్తులను రాజకీయాల్లోకి దింపుతామని… దేశ వ్యాప్తంగా ఉన్న 900 మంది పీఠాధిపతుల ఆశీర్వాదంతో త్వరలోనే ఏపీలో కొత్త పార్టీని స్థాపిస్తామని అన్నారు. త్వరలోనే తిరుపతిలో బహిరంగసభను పెడతామని… టిటిడిలో జరుగుతున్న అవినీతి, అక్రమాలను వెల్లడిస్తామని చెప్పారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/news/national/