సొంతగడ్డపై సింధు ఓడినా… హంటర్స్‌ గెలుపు

P. V. Sindhu
P. V. Sindhu

హైదరాబాద్‌: ప్రీమియర్‌ బ్యాడ్మింటన్‌ లీగ్‌ (పీబీఎల్‌) సీజన్‌5లో హైదరాబాద్‌ హంటర్స్‌ జట్టు సొంతగడ్డపై శుభారంభం చేసింది. బుధవారం గచ్చిబౌలి ఇండోర్‌ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో హంటర్స్‌ 2-1 తేడాతో నార్త్‌ ఈస్టర్న్‌ వారియర్స్‌ను ఓడించింది. అయితే సొంత అభిమానుల మధ్య భారీ అంచనాలతో బరిలోకి హంటర్స్‌ స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు ఓటమి షాక్‌కు గురి చేసింది. ఆద్యంతం తడబడి ఓటమితో నిరాశపర్చింది. అయితే తుది ఫలితం హంటర్స్‌కు అనుకూలంగా రావడం మాత్రం ఊరట. మహిళల సింగిల్స్‌ మ్యాచ్‌లో సింధు, మిషెల్లీ లీ (నార్త్‌ ఈస్టర్స్‌ వారియర్స్‌) చేతిలో పరాజయంపాలైంది. ముందుగా జరిగిన మిక్స్‌డ్‌ డబుల్స్‌ మ్యాచ్‌లో ఇవనోవ్‌- సిక్కిరెడ్డి జోడీ, కృష్ణప్రసాద్‌-కిమ్‌ హన జంటపై గెలిచి హైదరాబాద్‌కు శుభారంభం ఇచ్చింది. పురుషుల డబుల్స్‌లో హైదరాబాద్‌ జంట బెన్‌ లేన్‌ఇవనోవ్‌, బోదిన్‌ ఇసారాలీ యంగ్‌ డేపై సంచలన విజయం సాధించింది. ఇది నార్త్‌ ఈస్టర్న్‌కు ట్రంప్‌ మ్యాచ్‌ కావడంతో.. స్కోరు సమమైంది. నిర్ణయాత్మక ఆఖరి పురుషుల సింగిల్స్‌ మ్యాచ్‌లో డారెన్‌ ల్యూ, లి చక్‌ యుపై హంటర్స్‌ విజయం సాధించింది. దీంతో హైదరాబాద్‌ శిబిరంలో ఆనందం వెల్లువిరిసింది. గురువారం మ్యాచ్‌లో చెన్నై సూపర్‌స్టార్స్‌తో పుణే సెవెన్‌ ఏసెస్‌ జట్టు తలపడుతుంది.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/