వాస్తవాలు అర్థమయ్యేసరికి జగన్ భాష మారింది : పయ్యావుల కేశవ్

సీఎం పదవిలో ఉన్నవారు పీకుడు భాష మాట్లాడతారా?


అమరావతి: నా వెంట్రుక కూడా ఎవరూ పీకలేరంటూ ఏపీ ముఖ్యమంత్రి జగన్ నిన్న చేసిన వ్యాఖ్యలు పెను సంచలనాన్ని రేపాయి. ఈ క్రమంలో తాజాగా టీడీపీ సినియర్ నేత పయ్యావుల కేశవ్ మీడియాతో మాట్లాడుతూ.. జగన్ పై విమర్శలు గుప్పించారు. ఊహల్లో బతుకుతున్న జగన్ కు వాస్తవాలు అర్థమయ్యేసరికి భాష మారిందని పయ్యావుల ఎద్దేవా చేశారు. ప్రశాంత్ కిశోర్ ఇచ్చిన నివేదికలో ప్రభుత్వం విఫలమైందని తెలిసిందని… దీంతో, అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు స్వరంలో తీవ్రతను పెంచుతున్నారని అన్నారు. బాధ్యతాయుతమైన ముఖ్యమంత్రి పదవిలో ఉన్న ఏ వ్యక్తి అయినా పీకుడు భాష మాట్లాడతారా? అని ప్రశ్నించారు.

జగన్ కు ప్రజలు అధికారాన్ని కట్టబెట్టి మూడేళ్లయిందని… ఈ మూడేళ్లలో ఆయన ఏం పీకారో చెప్పాలని పయ్యావుల డిమాండ్ చేశారు. ఈ మూడేళ్లలో వైస్సార్సీపీ ప్రభుత్వం ఒక్క పనైనా సక్రమంగా చేసిందా? అని తాను ప్రశ్నిస్తున్నానన్నారు. ప్రజల జీవితాల్లో వెలుగులను పీకడమేనా మీరు చేసిందని విమర్శించారు. తాము పీకుడు భాష మాట్లాడేవాళ్లం కాదని అన్నారు. జగన్ మాట్లాడాకే తాము కూడా పీకుడు భాష మాట్లాడాల్సి వస్తోందని చెప్పారు.

జగన్ భాష మార్చుకోవాలని… లేకపోతే ఆయనను ప్రజలే పీకే పరిస్థితి వస్తుందని అన్నారు. ఏం పీకాలో, ఎలా పీకాలో ప్రజలు ఇప్పటికే డిసైడ్ అయ్యారని చెప్పారు. ప్రశాంత్ కిశోర్ ను పీకే దమ్ముందా? అని జగన్ ను పయ్యావుల ప్రశ్నించారు. రాయలసీమలో ఎంత మంది మంత్రులను జగన్ పీకుతారో చూస్తానని అన్నారు. విపక్షాలు, మీడియాపై పీకుడు భాషతో దాడి చేస్తారా? అని మండిపడ్డారు.

బలహీనతను కప్పిపుచ్చుకోవడానికే జగన్ ఇలాంటి భాష వాడుతున్నారని పయ్యావుల అన్నారు. సీఎం అసమర్థతకు ఈ వ్యాఖ్యలే నిదర్శనమని చెప్పారు. తాను బలంగా ఉన్నానని చెప్పుకోవడానికే జగన్ ఈ వ్యాఖ్యలు చేశారని ఎద్దేవా చేశారు. ప్రజా సమస్యలపై టీడీపీ పోరాటం చేస్తుందని ఆయన తెలిపారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/