10 వేలు చెల్లిస్తే.. సామాన్యూలకూ వీఐపీ బ్రేక్‌ దర్శనం

తిరుమల తిరుపతి దేవస్థానం తాజా యోచన
శ్రీవాణి పథకానికి విరాళం చెల్లించిన వారికి అవకాశం
ప్రస్తుతం రూ.10 లక్షలకు పైగా చెల్లించిన వారికే భాగ్యం

Tirumala
Tirumala

తిరుమల: సామాన్య భక్తులకు తిరుమలలో శ్రీవారి బ్రేక్‌ దర్శనం లభించనుంది. కేవలం రూ.10 వేలు విరాళంగా చెల్లించిన ప్రతి ఒక్కరికీ ఈ అవకాశం కల్పించాలని దేవస్థానం అధికారులు నిర్ణయించారు. జీవితంలో ఒక్కసారైనా తిరుమల కొండపైకి వెళ్లాలి, కొండపై కొలువుదీరిన శ్రీవారిని కనులారా దర్శించాలని ఆశించని భక్తులు ఉండరు. అష్టకష్టాలుపడి కొండెక్కి, క్యూలో నిల్చుని స్వామి సన్నిధికి చేరుకున్నా ఒక్కోసారి సెకన్లపాటు ఆయన దివ్యమంగళ స్వరూపాన్ని చూసే భాగ్యం కొందరికి దక్కదు. అటువంటి సందర్భాల్లో కొండంత ఆశతో కొండెక్కిన వారు తీవ్ర నిరాశతో తిరుగుముఖం పడతారు. అటువంటి సమస్య లేకుండా సామాన్య భక్తులు కూడా వీఐపీ బ్రేక్‌ దర్శనం చేసుకుని స్వామిని తనివితీరా చూసుకునే అవకాశం ఈ పథకం ద్వారా కల్పిస్తోంది దేవస్థానం.

టీటీడీ శ్రీవాణి పథకంలో భాగంగా బ్రేక్‌ దర్శనం టికెట్లు కేటాయించే యోచనలో ఉన్నట్లు టీటీడీ ఈఓ సింఘాల్‌ తెలిపారు. ఇప్పటి వరకు ఈ పథకంలో రూ.10 లక్షలు, ఆపైన చెల్లించిన వారికి బ్రేక్‌ దర్శనం లభిస్తోంది. ఇలా లభిస్తున్న నిధులను దేశవ్యాప్తంగా శ్రీవారి ఆలయాల నిర్మాణానికి టీటీడీ ఖర్చు చేస్తోంది. తాజా నిర్ణయంతో ఈ పథకానికి నిధులు వెల్లువెత్తుతాయని భావిస్తున్నారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/