పవన్ చనిపోవాలని అనుకున్నాడట..కానీ

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్ స్టాపబుల్ ఎపిసోడ్ 2 కు సంబదించిన స్ట్రీమింగ్ గురువారం రాత్రి 9 గంటల నుండే అందుబాటులోకి రావడం తో..రాత్రి నుండే ఈ షో ను అభిమానులు వీక్షిస్తూ సోషల్ మీడియా లో హైలైట్స్ ను షేర్ చేస్తున్నారు. మొదటి ఎపిసోడ్ పవన్ కళ్యాణ్ పెళ్లి లు , సరదా కబుర్లతో సాగగా..రెండో ఎపిసోడ్ మాత్రం పవన్ రాజకీయం, పొత్తులు , రైతు భరోసా వంటి అంశాలతో సాగింది. అదే క్రమంలో పవన్ చిన్నతనం లోని విషయాల గురించి కూడా బాలకృష్ణ అడగడం జరిగింది.

గతంలో తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకుందామని అనుకున్నట్లు పవన్ కల్యాణ్ పలుమార్లు వెల్లడించాడు. దీని గురించి బాలకృష్ణ ప్రస్తావిస్తూ ప్రశ్నించారు. దీనికి పవన్ సమాధానం చెప్పుకొచ్చారు. ‘నాకు చిన్నప్పటి నుంచి ఆస్తమా, జ్వరం సమస్యలు ఉండేవి. ముఖ్యంగా ఆరు, ఏడు తరగతుల్లో ఉన్నప్పుడు అనారోగ్యానికి గురయ్యేవాడిని. ఆ సమయంలో ఫ్రెండ్స్ లేక ఇంట్లోనే ఉండాల్సి వచ్చేది. దీంతో పుస్తకాలనే స్నేహితులు అనుకునేవాడిని. అంతేకాదు, స్కూల్, కాలేజ్‌కు వెళ్లాలంటే చాలా ఇబ్బంది పడేవాడిని’ అని పవన్ తెలిపాడు. నాకు స్కూల్స్ మాత్రమే కాదు.. టీచర్స్ కూడా అస్సలు నచ్చేవారు కాదు. అందుకే ప్రతిదాన్ని సొంతంగా నేర్చుకునేవాడిని. ఒకవైపు స్నేహితులు చదువు, ఆటల్లో రాణిస్తూ ఉంటే నేను ఎగ్జామ్స్‌లో ఫెయిల్ అయ్యేవాడిని. ఇలా 17 ఏళ్ల వయసు ఉన్నప్పుడే మానసికంగా బాగా క్రుంగిపోయాను.

ఒత్తిడిని భరించలేక చనిపోదాం అనుకున్నాను. వెంటనే అన్నయ్య దగ్గరున్న లైసెన్స్ పిస్టల్ తీసుకుని కాల్చుకుందాం అనుకున్నా. సురేఖ వదిన, నాగబాబు అన్నయ్య నన్ను చూసి ప్రశ్నించగా ఈ విషయం చెప్పాను. దీంతో వాళ్లు చిరంజీవి అన్నయ్య దగ్గరకు తీసుకెళ్లారు. ఆయన చదవకపోయినా పర్లేదు.. బ్రతికుండు అని అన్నారని పవన్ తెలిపాడు. ఇక ఎపిసోడ్ చివరలో చిత్రపరిశ్రమలో రాజకీయ పరంగా విభిన్నమైన ఆలోచన విధానాలు ఉండొచ్చు. మేము ఒకసారి వేరు అవ్వొచ్చు. కలవచ్చు, కలవకపోవచ్చు. ఏదైనా అవ్వొచ్చు కానీ, కనీసం సంస్కారం ఏమిటంటే.. కనీసం ఇలా కూర్చుని మనసు విప్పి మాట్లాడుకుని ఒక షోకి వచ్చి ఆనందంగా మాట్లాడుకుంటూ అందరికి సంతోషాన్ని పంచే వేదికలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అటువంటి వేదకకు సరైనా.. సరితూగే వ్యక్తి బాలకృష్ణ గారు. ఆయన ఘన విజయాలు సాధించాలని, రాజకీయాల్లో ఉన్నత పదవులు చేపట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను” పవన్ తెలిపాడు.