దుర్గమ్మ ను దర్శించుకున్న పవన్..వారాహికి పూజలు పూర్తి

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విజయవాడ దుర్గమ్మ ను దర్శించుకొని , తన వారాహి వాహనాన్ని పూజలు నిర్వహించారు. ఎన్నికల ప్రచార నిమిత్తం ఓ వాహనాన్ని పవన్ కళ్యాణ్ సిద్ధం చేసిన సంగతి తెలిసిందే. దీనికి వారాహి అనే పేరు పెట్టారు. నిన్న మంగళవారం కొండగట్టు అంజన్నను దర్శించుకొని, వారాహి కి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నేడు ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ అమ్మవారిని పవన్, జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్‌తో కలిసి దర్శించుకున్నారు. పవన్ కళ్యాణ్‌‌కు ఆలయం మర్యాదలతో స్వాగతం పలికారు. పవన్ కళ్యాణ్ అమ్మవారిని అంతరాలయం గుండా దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

దుర్గమ్మ దర్శనం అనంతరం జనసేనానికి ఆలయ ఆవరణలో వేద పండితుల ఆశీర్వచనం అందజేశారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని వేడుకున్నట్లు పవన్ చెప్పారు. పవన్ కళ్యాణ్ ఇంద్రకీలాద్రి కింద జనసేన ఎన్నికల ప్రచార రథం వారాహి వాహనానికి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. నేటి నుంచి రాక్షస పాలన అంతం చేయడమే వారాహి లక్ష్యమన్నారు. తెలుగు రాష్ట్రాలు ఐక్యతతో ఉండాలన్నారు. ముందుజాగ్రత్తగా ఇంద్రకీలాద్రి దగ్గర పోలీసులు మోహరించారు. అమ్మవారి దర్శనం కోసం పవన్ లోపలికి వెళ్లగా ఆయన వ్యక్తిగత సెక్యూరిటీని లోపలికి అనుమతించలేదు. ముఖ్య నేతలను మాత్రమే అనుమతించారు. ఈ నేపథ్యంలో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. తమ అధినేత పవన్ కల్యాణ్‌కు మంచి జరగాలని, భవిష్యత్‌లో జనసేన విజయం సాధించాలని అమ్మవారిని కోరుకున్నారు. కాగా పవన్ రాక సందర్భంగా ఘాట్ రోడ్లు మూసివేశారు.