‘ఉస్తాద్ భగత్ సింగ్’ విషయంలో పవన్ కీలక నిర్ణయం తీసుకున్నాడా..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఓ పక్క సినిమాలు , మరోపక్క రాజకీయాలు చేస్తూ క్షణం తీరిక లేకుండా గడుపుతున్నాడు. ఎన్నికలు వచ్చేలోపు ఒప్పుకున్నా సినిమాలను పూర్తి చేయాలనీ డిసైడ్ అయ్యాడు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్..హరిహర వీరమల్లు, OG , ఉస్తాద్ భగత్ సింగ్ తో పాటు సముద్రఖని డైరెక్షన్లో సాయి ధరమ్ తేజ్ తో కలిసి ఓ మూవీ చేస్తున్నాడు. అయితే ఇప్పుడు ‘ఉస్తాద్ భగత్ సింగ్’ విషయంలో ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

గతంలో హరీష్ శంకర్ డైరెక్షన్లో పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ మూవీ చేసాడు. అప్పటివరకు వరుస ప్లాప్స్ తో ఇబ్బంది పడుతున్న పవన్ కు ఈ మూవీ బూస్ట్ ను ఇచ్చింది. అభిమానులు పవన్ నుండి ఏం కోరుకుంటున్నారో..హరీష్ పవన్ ను ఆలా చూపించేసరికి సినిమా భారీ విజయం సాధించింది. ఇక ఇప్పుడు ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మూవీ కూడా అభిమానులు కోరుకునే విధంగా తెరకెక్కిస్తుండడం తో సినిమా ఫై రోజు రోజుకు అంచనాలు రెట్టింపు అవుతున్నాయి.

ఇటీవలే ఈ చిత్రం నుంచి వచ్చిన వీడియోకు అభిమానుల నుండి భారీ స్పందన వచ్చింది. ఫలితంగా ఈ చిత్రంపై హైప్ అమాంతం పెరిగిపోయింది. దీంతో పవన్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఈ చిత్రంపై అంచనాలు అంతకంతకూ పెరగడంతో పాటు దీని హక్కుల కోసం భారీ డిమాండ్ ఏర్పడడంతో ముందుగా దీన్నే పూర్తి చేయాలని పవన్ నిర్ణయించుకున్నట్లు ఓ వార్త బయటకు వచ్చింది. దీంతో ఎక్కువ శాతం డేట్స్ ఈ సినిమాకే కేటాయించేలా పవన్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇదే నిజమైతే అనుకున్న టైం కంటే ముందే ఈ మూవీ ని పవన్ పూర్తి చేస్తాడు.