పార్టీ శ్రేణులకు పవన్‌ కల్యాణ్‌ పిలుపు

2024కి ముందే ఎన్నికలు.. సిద్ధంగా ఉండండి..పవన్‌

Pawan kalyan
Pawan kalyan

అమరావతి: ఏపిలోని మంగళగిరి పార్టీ కార్యాలయంలో ఈరోజు పవన్‌ కళ్యాణ్‌ మాట్లాడుతూ.. సార్వత్రిక ఎన్నికలు 2024 కంటే ముందే వచ్చే అవకాశం ఉందని, ఇప్పటి నుంచే అందుకు సిద్ధం కావాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ప్రజల కోసం నిలబడాలన్న బలమైన ఉద్దేశంతోనే పార్టీని పెట్టినట్టు చెప్పిన పవన్.. గత ఎన్నికల్లో జన బలాన్ని ఓట్లుగా మార్చుకోవడంలో విఫలమైనట్టు చెప్పారు. భవిష్యత్తులో అధికారాన్ని అందుకోవాలంటే క్రియాశీలక సభ్యత్వం చాలా అవసరమని, ప్రతి సభ్యుడు కనీసం 50 మందిని ప్రభావితం చేయాలని సూచించారు. క్షేత్రస్థాయిలో బలమైన కార్యకర్తలు ఉన్నారని చెప్పుకునే తెలుగుదేశం పార్టీ కూడా ప్రజల్లోకి వెళ్లేందుకు భయపడుతోందని, ఒక్క జనసేన సైనికులు మాత్రమే బెదిరింపులు, ఒత్తిళ్లను ఎదుర్కొని ధైర్యంగా నిలబడుతున్నారని అన్నారు.

జనసేన మద్దతుదారులమంటూ కొందరు చిన్నచిన్నవేదికలు ఏర్పాటు చేసుకుని సొంత అజెండాతో వస్తున్నారని, అలాంటి వారిని ప్రోత్సహించవద్దని ప్రజలను కోరారు. ఎవరైనా సరే జనసేన స్రవంతి ద్వారానే రావాలని అన్నారు. పార్టీ నచ్చకపోతే సరైన కారణాలు తెలియజేయాలి తప్పితే ఇష్టమొచ్చినట్టు విమర్శిస్తామంటే కుదరదని అన్నారు. వందమంది వెళ్లిపోతే వెయ్యి మందిని తీసుకొస్తామని పవన్ స్పష్టం చేశారు. మరో రెండు వారాల్లో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం నిర్వహించి ఏపి ప్రభుత్వ మద్యం, ఇసుక విధానాలతోపాటు ఇతర సమస్యలపై చర్చిస్తామని పవన్ వివరించారు. జనసేన పార్టీ సభ్యత్వం తీసుకుంటే ప్రభుత్వ పథకాలు ఆపేస్తామని గ్రామ వలంటీర్ల ద్వారా బెదిరింపులకు దిగుతున్నారని, అయినా ఒత్తిళ్లకు తట్టుకుని పవన్ కల్యాణ్‌పై నమ్మకంతో పార్టీ సభ్యత్వం తీసుకుంటున్నారని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/