అనంతపురం జిల్లా రోడ్డు ప్రమాద ఘటన ఫై జనసేన అధినేత విచారం

అనంతపురం జిల్లా రోడ్డు ప్రమాద ఘటన ఫై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విచారం వ్యక్తం చేసారు. ధర్మవరం సమీపంలో గత రాత్రి జరిగిన ఆటో ప్రమాదంలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. నిండు నూరేళ్లు జీవించాల్సిన వాళ్లు హఠాత్తుగా రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరమే కాకుండా, చాలా బాధాకరమని పవన్ కళ్యాణ్ అన్నారు.

కూలీనాలీ చేసుకుని బత్తలపల్లి గ్రామం నుంచి ధర్మవరం వస్తున్న వీరు మార్గమధ్యంలోనే ప్రాణాలు కోల్పోవడం శోచనీయం అని పేర్కొన్నారు. వారికి బస్సు సౌకర్యం ఉండుంటే ఈ పరిస్థితి ఎదురయ్యేది కాదని పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు. గ్రామాల నుంచి పట్టణాలకు రావడానికి సరైన రవాణా మార్గాలు లేక ఆటోలను ఆశ్రయిస్తున్నారని వివరించారు. గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలకు రావడానికి తగినన్ని బస్సులు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని సూచించారు.