సుగాలి ప్రీతీ కేసు .. పవన్‌ హర్షం

ప్రీతీ తల్లిదండ్రుల కడుపుకోత, ఆవేదన, ఆక్రందన స్వయంగా చూశాను

pawan kalyan
pawan kalyan

అమరావతి: సుగాలి ప్రీతీ కేసులో తాము కోరిందే జరిగిందని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ కేసును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ( సీబీఐ)కు అప్పగించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వెనుక ఉన్న ప్రతి ఒక్కరినీ పేరు పేరునా అభినందిస్తున్నట్లు చెప్పారు. మూడేళ్ళ కిందట పాఠశాలకు వెళ్లిన ప్రీతీపై అత్యాచారం, హత్య జరిగింది. ఆమె తల్లిదండ్రుల కడుపు కోత, ఆవేదన, ఆక్రందనను తాను స్వయంగా చూశానన్నారు. తన బిడ్డ కేసులో న్యాయం కోసం ఆమె తల్లిదండ్రులు పడిన కష్టం పగవాడికి సైతం రాకూడదన్నారు. నడవలేని ప్రీతీ తల్లి చక్రాల కుర్చీలో మంగళగిరిలో జనసేన కార్యాలయానికి వచ్చినప్పుడు..ఆమె చెప్పిన అమానుష సంఘటన గురించి విన్న తరువాత ఈ పరిస్థితి ఏ పసిపాపకూ రాకూడదని భావించానని పవన్‌ అన్నారు. ఆ సంకల్పంతోనే ఈ నెల 12న కర్నూల్‌ వీధులలో సుగాలి ప్రీతీ కేసులో న్యాయం కోసం నినదించన్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telangana/