మోడీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన పవన్ కళ్యాణ్

గొప్ప దార్శనికునిగా భావిస్తానని వెల్లడి

మోడీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన పవన్ కళ్యాణ్
Pawan kalya with Modi -File

ప్రధాని నరేంద్ర మోడీకి జనసేన అధినేత, ప్రముఖ సినీ నటుడు పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేసారు. ఈ మేరకు శుక్రవారం పవన్ ఒక ప్రకటన విడుదల చేశారు .. మన భారత దేశానికి ధృడ చిత్తం కలిగిన నాయకుడు అవసరమని నేను నిత్యం పరితపించేవాడిని. ఆ నాయకుడు మన విశాల  భారత సంస్కృతి సంప్రదాయాలు తెలిసిన రాజనీతిజ్ఞుడై ఉండాలని కోరుకునేవాణ్ణి. ముఖ్యంగా భిన్న మతాలు, భిన్న జాతులు, భిన్న సంస్కృతులు, భిన్న ఆచార వ్యవహారాలు కలిగిన  ఒక బిలియన్ ప్రజల భూమిని  పాలించడం అంటే.. కత్తి మీద సాము వంటిదే. ఆ స్థానంలో ఉండటం ఎంతటివారికైనా సవాళ్లతో కూడుకున్నదే. అటువంటి స్థానంలో నిలిచిన నరేంద్ర మోదీ .. గొప్ప దార్శనికునిగా నేను భావిస్తాను.

2014 సార్వత్రిక ఎన్నికల సందర్బంగా మోదీ గారితో  కలసి అనేక సభలలో  ప్రచారంలో చేసే  గొప్ప అవకాశం నాకు లభించింది. ఆయనలోని ఆకర్షణ శక్తిని  సునిశితంగా గమనించడానికి  ఆ ప్రయాణం నాకు దోహదపడింది. ఆయనను రాజకీయంగా వ్యతిరేకించే ప్రత్యర్ధులు సైతం దేశం పట్ల ఆయనకు ఉన్న నిబద్ధతను మెచ్చుకోకుండా ఉండలేరు. 71వ జన్మదినం జరుపుకొంటున్న నరేంద్ర మోదీ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఆయనకు ఆయురారోగ్యాలతో కూడిన చిరాయువును ఆ ఆదిపరాశక్తి ప్రసాదించాలని కోరుకుంటున్నాను. ‘ అంటూ పేర్కొన్నారు

తాజా బిజినెస్‌ వార్తల కోసం: https://www.vaartha.com/news/business/