కేటీఆర్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన జనసేనాధినేత పవన్ కళ్యాణ్

టీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్ 47 వ పుట్టిన రోజు ఈరోజు. ఈ సందర్బంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కేటీఆర్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.

టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు, తెలంగాణ మున్సిపల్‌, ఐటీ శాఖల మంత్రి కల్వకుంట్ల తారక రామారావుకు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్‌ కల్యాణ్‌ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కాలికి తగిలిన గాయం వల్ల ప్రజాసేవకు కొంత అంతరాయం కలిగిందని తెలిసిందని , ఈ గాయం నుంచి త్వరగా కోలుకుని ప్రజాసేవలో మమేకం కావాలని ఆకాంక్షించారు. కేటీఆర్‌కు దీర్ఘాయుష్షు, ఆనందకరమైన ఆరోగ్యాన్ని ప్రసాదించాలని ఆ భగవంతుణ్ని కోరుకుంటున్నానని పవన్‌ కల్యాణ్‌ పేర్కొన్నారు.

ఇక కేటీఆర్ పుట్టిన రోజు సందర్బంగా రాజకీయాలకు అతీతంగా ఎందరో ఆయనకి శుభాకాంక్షలు తెలియచేస్తున్నారు. రాజ్యసభ ఎంపీ సంతోష్‌కుమార్‌, మంత్రి హరీష్‌ రావు, టాలీవుడ్‌ హీరోలు చిరంజీవి, రామ్‌ చరణ్‌ ఇలా ఎందరో కేటీఆర్‌ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే వేధం ఫౌండేషన్ చైర్మన్, టీఆర్ఎస్ నాయ‌కుడు అలిశెట్టి అరవింద్ వినూత్న రీతిలో బ‌ర్త్ డే విషెస్ చెప్పారు. నగరానికే త‌ల‌మానికంగా నిలిచిన దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపైన కార్లతో ప్ర‌ద‌ర్శ‌న నిర్వ‌హించారు. కార్ల‌పై హ్యపీ బ‌ర్త్ డే కేటీఆర్ అని రాసి, ప్ర‌ద‌ర్శించారు. శాస్త్ర, సాంకేతిక రంగాలపై పట్టున్న తమ నాయకుడి చొరవతో ఎన్నో అంతర్జాతీయ ఐటీ సంస్థలు హైదరాబాద్ విశ్వనగరంలో పెట్టుబడులు పెడుతున్నాయని అర‌వింద్ పేర్కొన్నారు. గొప్ప నాయక‌త్వ‌ లక్షణాలు కలిగిన తమ నాయకుడు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని కోరుకుంటున్నాన‌న్నారు. మంత్రి కేటీఆర్‌కు పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు తెలిపారు.