రేపు కడప జిల్లాలోని సిద్ధవ‌టం గ్రామంలో ప‌వ‌న్ క‌ల్యాణ్ ర‌చ్చ‌బండ కార్యక్రమం

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రేపు కడప జిల్లాలో పర్యటించబోతున్నారు. రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కుటుంబాలకు పవన్ కళ్యాణ్ లక్ష రూపాయిల ఆర్ధిక సాయం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలు జిల్లాలో పర్యటించి రైతు కుటుంబాలకు తన వంతు సాయం చేసారు. రేపు కడప జిల్లాలో కౌలు రైతుల భ‌రోసా యాత్ర‌ చేపట్టబోతున్నారు.

ఈ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా జిల్లాలోని సిద్ధవ‌టం గ్రామంలో ప‌వ‌న్ క‌ల్యాణ్ ర‌చ్చ‌బండ పేరిట రైతుల‌తో ముఖాముఖి నిర్వ‌హించ‌నున్నారు. ర‌చ్చ‌బండ‌లోనే ఆయ‌న ప‌లువురు రైతుల కుటుంబాల‌కు రూ.1 ల‌క్ష చొప్పున స‌హాయం అందించ‌నున్నారు. జిల్లా ప‌రిధిలో ఆత్మహత్యలకు పాల్పడిన 176 మంది కౌలు రైతు కుటుంబాలకు ఒక్కొక్కరికి లక్ష రూపాయల చొప్పున పవన్ కళ్యాణ్ ఆర్థిక సహాయం అందించనున్నారు.

యాత్ర లో భాగంగా పవన్ కళ్యాణ్ ఉదయం 12 గంటలకు విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి నేరుగా సిద్ధవటంలోని సభా ప్రాంగణానికి చేరుకుని జిల్లాలో ఆత్మహత్యకు పాల్పడిన 176 కౌలు రైతు కుటుంబాలకు రూ. లక్ష చొప్పున ఆర్థిక సాయం అందచేస్తారని నాదెండ్ల మనోహర్ తెలిపారు. రైతాంగానికి అండగా నిలబడే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం ఇప్పటికే అనంతపురం, కర్నూలు, ఉభయ గోదావరి జిల్లాలతోపాటు ప్రకాశం జిల్లాలోనూ పూర్తయ్యిందని పేర్కొన్నారు.