ఒక్క అవకాశం ఇస్తే మార్పు అంటే ఏంటో చూపిస్తా – పవన్ కళ్యాణ్

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదివారం విజయనగరం జిల్లాలో పర్యటిస్తున్నారు. అడుగడుగునా అభిమానులు , కార్య కర్తలు , ప్రజలు బ్రహ్మ రధం పడుతున్నారు. విజయనగరం జిల్లా గుంకలాంలో నిర్మిస్తున్న జగనన్న కాలనీని పవన్ కళ్యాణ్ పరిశీలించారు.

అనంతరం మాట్లాడుతూ..ఇళ్ల నిర్మాణం పేరుతో రూ. 12 వేల కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారు. జనసేన పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పేదలందరికీ ఉచితంగా ఇసుక అందిస్తామని వెల్లడించారు. వైసీపీ ప్రభుత్వ మోసాన్ని ప్రజలంతా గుర్తించాలని.. ఉత్తరాంధ్రులకు బలమైన రాజకీయ అధికారం దక్కాలని ఆకాంక్షించారు. జనసేనకు ఒక్క అవకాశం ఇస్తే మార్పు అంటే ఏంటో చూపిస్తామన్నారు.

రాష్ట్ర భవిష్యత్‌ కోసం తనను నమ్మాలని.. తనపై నమ్మకం ఉంచితే గూండాలతో పోరాడేందుకు తాను సిద్ధమని పిలుపునిచ్చారు. మత్స్యకారులు ఉపాధి కోసం గోవా, ఇతర ప్రాంతాలకు వెళ్తున్నారని.. జనసేన అధికారంలోకి వస్తే ఇక్కడే జెట్టీలు నిర్మించి వారికి ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తామని పవన్ కళ్యాణ్ అన్నారు. అవినీతిపై రాజీలేని పోరాటం చేద్దామని.. అవినీతి రహిత ప్రభుత్వాన్ని తీసుకొద్దామని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. ఉత్తరాంధ్ర జనసైనికులు ధైర్యంగా పోరాడాలని.. బలంగా ఎదుర్కోవాలని సూచించారు. పోలీసులు కేసులు పెడితే మీతో పాటు నేనూ జైలుకు వస్తానని పవన్ కళ్యాణ్ వెల్లడించారు.