జనసేనకు అండగా ఉండాలని ప్రజలను కోరిన పవన్ కళ్యాణ్

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈరోజు బాపట్ల జిల్లాలో కౌలురైతు భరోసా యాత్ర చేపట్టారు. కౌలురైతు భరోసా యాత్రలో భాగంగా.. ఆత్మహత్య చేసుకున్న 80 మంది కౌలు రైతు కుటుంబాలకు రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం అందించారు. ఈ సందర్బంగా నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడుతూ.. వైసీపీ నేతలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వైసీపీ నేతలు అధికారమదంతో కొట్టుకుంటున్నారని మండిపడ్డారు. వైసీపీ నేతలకు సంస్కారం లేదన్నారు. తాను అన్యాయంపై ప్రశ్నిస్తే వ్యక్తిగతంగా దూషిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఎలా ఊరుకుంటామని అన్నారు. వైసీపీ నేతలు ఎవరినైనా, ఏమైనా అనొచ్చు కానీ, ప్రభుత్వ వైఫల్యాలను మాత్రం ఎవరూ ప్రశ్నించకూడదా? అని నిలదీశారు.

ప్రభుత్వాన్ని ప్రశ్నించినవారిని మానసికంగా వేధిస్తున్నారని తెలిపారు. వైసీపీ అరాచకాలపై ప్రశ్నిస్తే దత్తపుత్రుడు అంటున్నారని ఆరోపించారు. తాను ఎవరికీ దత్తపుత్రుడ్ని కాదని, కేవలం ప్రజలకే దత్తపుత్రుడ్ని అని పవన్ కల్యాణ్ ఉద్ఘాటించారు. వైస్సార్సీపీ అసమర్థ పాలన వల్ల ప్రకాశం జిల్లా నుంచి వలసలు బాగా పెరిగాయని పవన్‌ కల్యాణ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రకాశం జిల్లాలో రాజకీయ నాయకుల వద్ద మాత్రమే డబ్బు ఉందని, సామాన్య ప్రజలు పొట్ట చేతపట్టుకొని వలసలు పోతున్నారని అన్నారు. ప్రకాశం జిల్లా దుస్థితిని మార్చేందుకు మహిళలు కొంగు బిగించాలి జనసేనాని పిలుపునిచ్చారు. రాష్ట్ర విభజన జరిగినప్పటినుంచీ.. ఆంధ్రకు అన్యాయమే జరుగుతోందన్న పవన్.. అయినా అధికార పార్టీ నాయకులు ప్రశ్నించడం లేదని అన్నారు. బిజినెస్ వ్యవహారాలు చూసుకోవడానికే పార్లమెంటు, అసెంబ్లీకి వెళ్తున్నారని ఆరోపించారు. అందుకే బాధ్యత కలిగిన వ్యక్తులను చట్ట సభలకు పంపించాలను కోరారు. ప్రత్యేక హోదా, వైజాగ్ స్టీల్‌ ప్లాంట్‌కు సొంత గనుల కోసం.. వైస్సార్సీపీ నేతలు ఎందుకు గట్టిగా అడగరు అని నిలదీశారు.

జనసేన అధికారంలోకి రాగానే జాబ్‌ క్యాలెండర్‌ ప్రకటిస్తామన్నారు. లక్షకోట్లు దోపిడీ చేసే సత్తా వైస్సార్సీపీ వాళ్లకి ఉన్నప్పుడు.. రెండున్నర లక్షల ఉద్యోగాలు తెచ్చే సత్తా జనసేనకు ఉందన్నారు. రైతులకు గిట్టు బాటు ధర కల్పిస్తామని చెప్పారు. చాలాసార్లు ఇతరులకు అవకాశం ఇచ్చారని, ఈ సారి జనసేనకు అవకాశం ఇవ్వండని కోరారు. రాబోయే ఎన్నికలు కీలకమైనవన్న పవన్.. ఈ సారి ప్రజలు జనసేన వైపు చూడాలని కోరారు. పొత్తులపై కీలక వ్యాఖ్యలు చేసిన జనసేనాని.. తమకు ఎవరితోనూ పొత్తు లేదని, ప్రజలతోనే పొత్తు ఉందని అన్నారు. దసరా వరకు వైస్సార్సీపీ నేతలు ఏమన్నా పట్టించుకోబోమన్న పవన్.. ప్రజల సమస్యలు వినడానికి దసరా తర్వాత రోడ్డెక్కుతామని, అప్పుడు వాళ్లకు ఉంటుందని అన్నారు.