చిత్ర పరిశ్రమ ఒకరి సొత్తు కాదు.. అందరి సొత్తు – పవన్ కళ్యాణ్
తెలుగు చిత్ర పరిశ్రమ ఒకరి సొత్తు కాదు.. అందరి సొత్తు. ఎన్ని ఎదురుదెబ్బలు తగిలినా నిలబడగలిగే గుండెధైర్యం మీరు ఇచ్చారు. చిత్ర పరిశ్రమ అంటే మాది మనది.. మనందరిది అంటూ పవన్ కళ్యాణ్ అన్నారు. శ్యామ్ సింగ రాయ్ మూవీ తో సూపర్ హిట్ అందుకున్న హీరో నాని..ప్రస్తుతం వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ‘అంటే సుందరానికి’ అనే మూవీ చేస్తున్నాడు. ‘బ్రోచేవారేవరురా’, ‘మెంటల్ మదిలో’ చిత్రాలతో దర్శకుడిగా నిరూపించుకున్న వివేక్ ఆత్రేయ.. ఇప్పుడు నానితో ‘అంటే సుందరానికి…’ అనే వెరైటీ చిత్రాన్ని రూపొందిస్తుండటంతో అంచనాలు పెరిగాయి. నాని కెరియర్లో ఇది 28వ సినిమా కాగా.. మైత్రీ మూవీ మేకర్స్‌లో నవీన్ ఎర్నేని, రవి శంకర్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ మూవీ ద్వారా మలయాళ కుట్టీ నజ్రియా టాలీవుడ్‌కి హీరోయిన్గా ఎంట్రీ ఇస్తున్నారు. అన్ని కార్య క్రమాలు పూర్తి చేసుకొని రేపు ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
ఈ తరుణంలో చిత్ర ప్రమోషన్ లో భాగంగా చిత్ర ప్రీ రిలీజ్ వేడుకను ఈరోజు గురువారం సాయంత్రం హైదరాబాద్ లోని శిల్పకళా వేదిక లో అట్టహాసంగా జరిపారు. ఈ వేడుకకు ముఖ్య అతిధిగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రావడం ప్రీ రిలీజ్ వేడుకకే కాదు సినిమా కు బజ్ వచ్చింది. ఇక ప్రీ రిలీజ్ వేడుకలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ..నాని ని ఆకాశానికి ఎత్తేసారు. ఈ సినిమా హీరో నాని నటనే కాదు.. ఆయన వ్యక్తిత్వం అంటే నాకు చాలా గౌరవం, ఇష్టం. బలంగా నిలబడగలిగే వ్యక్తి.. ఆయనకి భగవంతుడు విజయాలను ప్రదర్శించాలని కోరుతున్నా అన్నారు. ఈ సినిమాలో నటించిన నరేష్ గారంటే నాకు చాలా ఇష్టం, గౌరవం. నేను సినిమాల్లోకి రాకముందు నుంచి ఆయన నాకు తెలుసు. చెన్నైలో మేం పక్క పక్కనే ఉండేవాళ్లం. విడిగా ఆయన వ్యక్తిత్వం చాలా బలమైనది. ఆయన నటన కూడా అద్భుతంగా ఉంటుంది. అలాగే ఈ సినిమాలో నటించిన రోహిణి, నదియా మిగిలిన ఆర్టిస్ట్‌లను అభినందనలు తెలియజేస్తున్నా. వివేక్ సాగర్ ఈ సినిమాకి మంచి సంగీతం అందించారు. దర్శకుడు వివేక్ ఆత్రేయ ఈ సినిమా అద్భుతంగా చేశారు.. ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారు.
తెలుగు చిత్ర పరిశ్రమ ఒకరి సొత్తు కాదు.. అందరి సొత్తు. ఎన్ని ఎదురుదెబ్బలు తగిలినా నిలబడగలిగే గుండెధైర్యం మీరు ఇచ్చారు. చిత్ర పరిశ్రమ అంటే మాది మనది.. మనందరిది. మా సినిమా బాగుండాలని కోరుకుంటాం తప్పితే.. ఎదుటివాళ్ల సినిమా పోవాలని కోరుకోం. రాజకీయ పరంగా చిత్ర సీమలో విభిన్న ఆలోచనలు ఉండొచ్చుకానీ సినిమా వేరు రాజకీయం వేరు అన్నారు.