సత్యసాయి జిల్లాలో ప్రమాదం ఫై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దిగ్బ్రాంతి

సత్యసాయి జిల్లా తాడిమర్రి మండలం చిల్లకొండయ్యపల్లిలో ప్రయాణిస్తున్న ఆటో ఫై హై టెన్షన్ విద్యుత్ తీగలు పడి ఐదుగురు సజీవ దహనం అయ్యారు. ఈ ఘటన పట్ల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దిగ్బ్రాంతి వ్యక్తం చేసారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కూలీలు మృత్యువాత పడిన ఘటన అత్యంత విచారకరమన్నారు. విద్యుత్‌ తీగ తెగిపడడం మానవ తప్పిదమా ? నిర్వహణ లోపమా అని పవన్‌ కల్యాణ్‌ అనుమానం వ్యక్తం చేశారు. ఛార్జీలు పెంచడంపై చూపించే శ్రద్ధ విద్యుత్‌ లైన్ల నిర్వహణపై చూపాలని సూచించారు. చాలాచోట్ల విద్యుత్‌ స్తంభాలు ఒరిగి, వేలాడుతున్నా.. పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఈ ప్రమాదంపై నిపుణులతో విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు.

ఇక ఈ ఘటన పట్ల డీఎస్పీ రమాకాంత్‌ స్పందించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కుటుంబ సభ్యులు వ్యవసాయ పనుల కోసం ఆటోపై ఇనుప మంచం తీసుకెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఇనుప మంచానికి తెగిపడిన విద్యుత్‌ తీగ తగలడంతో మంటలు చెలరేగాయి. ఈ క్రమంలో కొందరు ఆటో నుంచి దూకి బయటపడ్డారు. ఆటోలో ఉన్న ఐదుగురు మహిళలు మాత్రం మంటల్లో సజీవ దహనమయ్యారు. మృతులను గుడ్డంపల్లి వాసులుగా గుర్తించాము అని తెలిపారు. అలాగే ఏపీఎస్పీడీసీఎల్‌ సీఎండీ హరినాధ రావు సైతం తీవ్ర విచారం వ్యక్తం చేసారు. ప్రమాదంలో మృతి చెందిన వారికి రూ. 5 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ. 2 లక్షల తక్షణ సహాయం అందిచనున్నట్టు తెలిపారు. ప్రమాద ఘటనలో వెలుగు చూసిన దాని ప్రకారం ఒక ఉడుత కారణంగా ఈ ప్రమాదం జరిగిందని నిర్ధారించారు. కరెంట్‌ వైర్‌ను ఎర్త్‌ను ఉడుత క్రాస్ చేయడంతో ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు. ప్రమాద ఘటనపై శాఖ పరమైన విచారణకు ఆదేశించనట్టు వెల్లడించారు. అనంతపురం ఎస్.ఈతో పూర్తి విచారణకు ఆదేశించామని తెలిపారు.