కేంద్రం నిర్ణయాన్ని జనసేన స్వాగతిస్తుంది..పవన్‌

నూతన విద్యావిధానానికి రూపకల్పన చేసిన కేంద్రం

pawan kalyan
pawan kalyan

అమరావతి: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ కేంద్రం నిర్ణయాన్ని జనసేన స్వాగతిస్తోందని తెలిపారు. ఐదో తరగతి వరకు మాతృభాషలోనే బోధన జరగాలంటూ కేంద్రం నూతన విద్యావిధానానికి రూపకల్పన చేయడంపై పవన్ కల్యాణ్ స్పందించారు. మాతృభాషలో బోధన జరిగినప్పుడు గొప్ప ఫలితాలు ఆవిష్కృతమవుతాయని యునెస్కో 2008లోనే ప్రకటించిందని తెలిపారు. ఇటీవల ఏపి సర్కారు ఇంగ్లీషు మీడియంపై నిర్ణయం తీసుకున్నప్పుడు జనసేన తీవ్రంగా వ్యతిరేకించింది ఇందుకేనని స్పష్టం చేశారు.

అయితే, జనసేన ఇంగ్లీషు మీడియం బోధనకు ఏమాత్రం వ్యతిరేకం కాదని, ఏపిలో ఇంగ్లీషు మీడియాన్ని తప్పనిసరి చేసినప్పుడు మాత్రమే వ్యతిరేకించామని పేర్కొన్నారు. తమ పిల్లలు ఏ భాషలో చదవాలన్నది తల్లిదండ్రుల నిర్ణయానికే వదిలేయాలని, ఇంగ్లీషు మీడియం ఓ ఆప్షన్ గా మాత్రమే ఉండాలన్నది జనసేన పార్టీ అభిప్రాయం అని పవన్ స్పష్టం చేశారు. తాజాగా, ప్రాథమిక విద్యాబోధన మాతృభాషలోనే జరగాలని నిర్ణయించిన కమిటీ సభ్యులకు, కమిటీ సిఫారసులను ఆమోదించిన ప్రధాని నరేంద్ర మోడికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామని పేర్కొన్నారు.


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/