ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టే ప్రగతి వద్దుః : పవన్ కల్యాణ్

రక్షణ కోసం అన్ని రకాల చర్యలు తీసుకోవాలని డిమాండ్

Pawan kalyan
Pawan kalyan

విజయవాడః అనకాపల్లి జిల్లాలోని అచ్చుతాపురం సెజ్‌లో తరుచూ చోటు చేసుకుంటున్న ప్రమాదాలు ఆందోళనకరంగా ఉన్నాయని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. అచ్యుతాపురం సెజ్ లోని ఓ కంపెనీలో మంగళవారం సాయంత్రం విష వాయువు లీకై 125 మంది మహిళలు తీవ్ర అస్వస్థతతో ఆసుప్రతి పాలవడం దురదృష్టకరమన్నారు. ఇదే కంపెనీలో నెల క్రితం విష వాయువు లీకై, 400 మంది అస్వస్థతకు గురైనట్టు గుర్తు చేశారు. ఈ విషయంలో ప్రజాప్రతినిధులు, అధికారుల నిర్లిప్తతను ఆయన ఎత్తి చూపించారు. ప్రమాదానికి కారణం చెప్పకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుందన్నారు. ఈ మేరకు పవన్ కల్యాణ్ జనసేన పార్టీ ట్విట్టర్ పేజీలో ఓ ప్రకటన విడుదల చేశారు.

ఎల్జీ పాలిమర్స్ లో ప్రమాదం ఎన్నో ప్రాణాలను హరించడాన్ని, ఎంతో మందిని శాశ్వత అనారోగ్యానికి గురి చేయడాన్ని మరిచిపోలేమన్నారు. ‘‘ప్రధానంగా ఔషధ, రసాయన, ఉక్కు, జౌళి కర్మాగారాలలో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. దీంతో పరవాడ, దువ్వాడ, అచ్యుతాపురం పారిశ్రామిక ప్రాంతాల చుట్టుపక్కల కాలనీవాసులు, గ్రామస్థులు ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో, ఏ విష యవాయువు ప్రాణాలు తీస్తుందో అని బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. రాష్ట్రం, దేశ ప్రగతికి పరిశ్రమలు ఎంతో అవసరం అనడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు. అయితే ఆ ప్రగతి ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టి కాదు. దుస్తుల కర్మాగారంలో ప్రమాదం వల్ల అస్వస్థతకు గురైన మహిళలకు మంచి వైద్యాన్ని, నష్టపరిహారాన్ని అందించాలని కోరుతున్నాను’’ అంటూ పవన్ కల్యాణ్ ప్రకటనలో పేర్కొన్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/telangana/