సూపర్ స్టార్ బిరుదుకి సార్థకత తెచ్చారుః పవన్

ప్రతి ఒక్కరితో ఎంతో ఆప్యాయంగా ఉండేవారన్న జనసేనాని

Pawan Kalyan's criticism of the AP government
Pawan kalyan

అమరావతిః జనసేనాని పవన్ కల్యాణ్ సూపర్ స్టార్ కృష్ణ మృతి పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. చిత్రసీమలో సూపర్ స్టార్ బిరుదుకి సార్థకత చేకూర్చిన కృష్ణ గారు తుది శ్వాస విడిచారనే విషయం ఎంతో ఆవేదన కలిగించిందని అన్నారు. కృష్ణ గారు అస్వస్థతతో ఆసుపత్రిలో చేరారని తెలిశాక కోలుకుంటారని ఆశించానని… కానీ, ఇప్పుడు ఈ విషాద వార్త వినాల్సి వచ్చిందని చెప్పారు. కృష్ణ గారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని అన్నారు. స్నేహశీలి, మృదుస్వభావి అయిన కృష్ణ గారు ప్రతి ఒక్కరితో ఎంతో ఆప్యాయంగా ఉండేవారని చెప్పారు. మద్రాస్ లో ఉన్నప్పటి నుంచి తమ కుటుంబంతో ఆయనకు చక్కటి అనుబంధం ఉందని తెలిపారు.

తెలుగు చిత్ర పరిశ్రమ అభివృద్ధికి కథానాయకుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా, స్టూడియో అధినేతగా కృష్ణగారు చేసిన సేవలు చిరస్మరణీయాలని పవన్ అన్నారు. తెలుగు సినీ పరిశ్రమ ప్రస్థానంలో ఆయన నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని పరిచయం చేశారని కొనియాడారు. విభిన్న పాత్రలను పోషించిన కృష్ణ గారు కౌబోయ్, జేమ్స్ బాండ్ కథలతో తెలుగు ప్రేక్షకులకు కొత్త అనుభూతిని కలిగించారని చెప్పారు. పార్లమెంటు సభ్యుడిగా కూడా ప్రజా జీవితంలో తనదైన ముద్రను వేశారని ప్రశంసించారు.

సినిమా రంగం క్షేమాన్ని కాంక్షించే కృష్ణ గారి మరణం తెలుగు చలనచిత్ర సీమకు తీరని లోటు అని పవన్ అన్నారు. ఆయన కుమారుడు మహేశ్ బాబుకు గారికి, ఇతర కుటుంబ సభ్యులకు తన తరపున, జనసేన పక్షాన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని చెప్పారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/news/national/