తెలంగాణ నేల పెట్టిన తిండి తిన్నాను… అది ఎక్కడికి పోతుంది… రక్తంలో ఇంకిపోయింది – పవన్

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కొండగట్టు సాక్షిగా తెలంగాణ ఫై తనకున్న ప్రేమను చాటుకున్నారు.ఈ నేల పెట్టిన తిండి తిన్నాను… అది ఎక్కడికి పోతుంది… రక్తంలో ఇంకిపోయింది అన్నారు. మంగళవారం తన వారాహి వాహన పూజా నిమిత్తం కొండగట్టుకు వచ్చిన పవన్..వారాహి పూజా కార్యక్రమాలు అనంతరం మాట్లాడుతూ..తెలంగాణ ప్రజలకు సందేశం ఇచ్చే స్థాయిలో తాను లేనని, తెలంగాణ ప్రజల నుంచి నేర్చుకునే స్థాయిలో ఉన్నానని తెలిపారు. తెలంగాణ ప్రజల పోరాటాల నుంచి తాను స్ఫూర్తి పొందుతానని వివరించారు. తాను ఏపీలో చెప్పుతో కొడతానని అన్న మాటల వెనుక స్ఫూర్తి కలిగించింది తెలంగాణ గడ్డ అని పవన్ వెల్లడించారు. గతంలో బట్టలూడదీసి కొడతా అన్నది కూడా తెలంగాణ గడ్డపైనే అని చెప్పుకొచ్చారు.

ఈ నేల పెట్టిన తిండి తిన్నాను… అది ఎక్కడికి పోతుంది… రక్తంలో ఇంకిపోయింది. నాదొక్కటే కోరిక… కనీసం పది మంది అయినా తెలంగాణ అసెంబ్లీలో జనసేన ఎమ్మెల్యేలు ఉండాలి” అని ఆకాంక్షను వ్యక్తం చేశారు. అలాగే వచ్చే ఎన్నికల్లో పొత్తులపై పవన్ కల్యాణ్ మరోసారి క్లారిటీ ఇచ్చారు. బీజేపీతో ఇప్పుడు కలిసే ఉన్నానని, ఆ పార్టీతో పొత్తు కొనసాగుతోందని స్పష్టం చేశారు. ఎవరు కలిసి వచ్చినా, రాకపోయినా ముందుకెళ్తామన్నారు. వారం రోజుల్లో ఎన్నికలు ఉంటే పొత్తులపై మాట్లాడొచ్చని, కేసీఆర్ బీఆర్ఎస్ పెట్టడాన్ని స్వాగతిస్తున్నట్లు తెలిపారు. కొత్త పొత్తులు కుదిరితే కొత్తగా వెళ్తామని, లేకపోతే ఒంటరి పోరుకు కూడా సై అని పవన్ అన్నారు.

2014 కాంబినేషన్‌పై కాలమే నిర్ణయిస్తుందని పవన్ చెప్పారు. పవన్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. ఎవరైనా తమతో పొత్తు పెట్టుకునేందుకు ముందుకు రావొచ్చనే సంకేతాలను పవన్ స్పష్టంగా ఇచ్చారు. ఇప్పటికే టీడీపీతో పవన్ పొత్తు ఖాయమైందనే ప్రచారం క్రమంలో.. పవన్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. విపక్షాలను అణచివేయడానికే వైస్సార్సీపీ ప్రభుత్వం జీవో నెంబర్ 1ను తీసుకొచ్చిందని విమర్శించారు. అన్ని పార్టీలు కలిసికట్టుగా పోటీ చేయాలనేదే తన కోరిక అని పవన్ చెప్పారు. ఓట్లను చీలనివ్వబోమని అన్నారు. రోజురోజుకు వైస్సార్సీపీకి నమ్మకం సన్నగిల్లుతోందని వ్యాఖ్యానించారు. అందుకే తన పర్యటనకు, నారా లోకేశ్ పాదయాత్రకు ఆటంకాలను కలిగించేందుకు యత్నిస్తున్నారని విమర్శించారు. 175 సీట్లలో గెలుస్తామని చెప్పుకునే వైస్సార్సీపీ కి అంత భయం ఎందుకని ప్రశ్నించారు.