పవన్ కల్యాణ్ పై ఎలాంటి రెక్కీ జరగలేదు..ఫుల్ క్లారిటీ ఇచ్చిన తెలంగాణ పోలీసులు

గత నాల్గు రోజులుగా మీడియా లో పవన్ కళ్యాణ్ ఇంటి వద్ద రిక్కీ వ్యవహారం వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. పవన్ కళ్యాణ్ కు హై సెక్యూరిటీ ఏర్పాటు చేయాలనీ అభిమానులు కోరుతున్నారు. ఈ క్రమంలో తెలంగాణ పోలీసులు ఈ రిక్కీ ఫై ఫుల్ క్లారిటీ ఇచ్చారు.

పవన్ ఇంటి ముందు ఎలాంటి రెక్కీ జరగలేదని పోలీసులు శుక్రవారం ప్రకటించారు. పవన్ కల్యాణ్‌పై ఎలాంటి రెక్కీ కానీ, దాడికి కుట్ర గాని జరగలేదని తేల్చారు. పవన్‌ కల్యాణ్‌ ఇంటి ముందు కారు ఆపింది ముగ్గురు యువకులు అని తెలిపారు. కారు తీయమని అడిగిన పవన్‌ సెక్యూరిటీతో యువకులు గొడవకు దిగారు. అయితే.. మద్యం మత్తులో గొడవ చేసినట్లు యువకులు ఒప్పుకున్నారని పోలీసులు వెల్లడించారు. యువకులను విచారించి నోటీసులు ఇచ్చామని జూబ్లీహిల్స్‌ పోలీసులు పేర్కొన్నారు.

గత నెల 31న రాత్రి సమయంలో ఆదిత్య, సాయికృష్ణ, వినోద్ అనే ముగ్గురు యువకులు హైదరాబాద్ లోని పవన్ ఇంటి వద్ద పవన్ బౌన్సర్లతో గొడవకు దిగారు. ఈ క్రమంలో పవన్ ఇంటిపై రెక్కీ నిర్వహించేందుకే ఆ యువకులు అక్కడికి వచ్చారని, అంతేకాకుండా పవన్ ను కొందరు గుర్తు తెలియని వ్యక్తులు వెంబడిస్తున్నారని జనసేన ఆందోళన వ్యక్తం చేసింది. గత నెల 31న రాత్రి ఘటనపై పవన్ సెక్యూరిటీ సిబ్బంది ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు… గొడవకు కారణమైన యువకులను అదుపులోకి తీసుకున్నారు. మరి పోలీసులు తెలిపిన దాని ప్రకారం ఈ ఇష్యూ కు ఫుల్ స్టాప్ పడుతుందా లేదా అనేది చూడాలి.