నన్ను ఊపిరి తీసుకోవడం కూడా ఆపేయమంటారా అంటూ వైస్సార్సీపీ ఫై పవన్ ఫైర్

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి వైస్సార్సీపీ పార్టీ ఫై ఫైర్ అయ్యారు. తాజాగా జనసేన ఎన్నికల ప్రచార రథం సిద్దమైన సంగతి తెలిసిందే. ఈ వాహనానికి ‘వారాహి’ అనే పేరు పెట్టారు. అయితే ఆలివ్ గ్రీన్ కలర్ లో ఉన్న ఈ వాహన కలర్ ఫై వైస్సార్సీపీ పలు విమర్శలు చేస్తూ వస్తుంది. వారాహికి తెలుపు, నలుపు, మరో రంగు కాకుండా పసుపు రంగు వేసుకుంటే సరిపోతుందని మాజీ మంత్రి పేర్ని నాని ఎద్దేవా చేశారు. ఆలివ్ గ్రీన్ రంగు కేవలం మిలిటరీ వాహనాలకు మాత్రమే వాడతారని… వారాహికి ఆ రంగు వేయడం చట్ట విరుద్ధమని అన్నారు. లక్షల పుస్తకాలు చదివానని చెప్పుకునే పవన్ కల్యాణ్ కు మోటార్ వెహికల్ యాక్ట్ పుస్తకాన్ని చదివే సమయం దొరకలేదా? అని ప్రశ్నించారు. డబ్బులు ఉన్న ప్రతి ఒక్కరూ వ్యాన్లను కొనుక్కుని యుద్ధం చేస్తామంటే కుదరదని అన్నారు. ఇలాంటివి సినిమాల్లో నడుస్తాయని, నిజ జీవితంలో కుదరవని నాని అన్నారు.

ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ ట్విట్టర్ వేదిక గా ఆగ్రహం వ్యక్తం చేసారు. నన్ను ఊపిరి తీసుకోవడం కూడా ఆపేయమంటారా అంటూ ఫైర్ అయ్యారు. తన సినిమాలను అడ్డుకున్నారని… తాను విశాఖ పర్యటనకు వెళ్లినప్పుడు తనను వాహనం నుంచి, హోటల్ గది నుంచి బయటకు రాకుండా అడ్డుకున్నారని… సిటీ నుంచి వెళ్లిపోవాలని ఒత్తిడి చేశారని పవన్ అన్నారు. మంగళగిరిలో తన వాహనం వెళ్లకుండా అడ్డుకున్నారని, కనీసం నడుచుకుంటూ వెళ్లడానికి కూడా లేకుండా ఆటంకాలు కలిగించారని అన్నారు. ఇప్పుడు తన ప్రచార రథం వారాహి విషయంలో కూడా వివాదాన్ని సృష్టిస్తున్నారని మండిపడ్డారు. నన్ను ఊపిరి తీసుకోవడం కూడా ఆపేయమంటారా? అని ప్రశ్నించారు. కనీసం ఈ చొక్కాను అయినా వేసుకోనిస్తారా వైస్సార్సీపీ? అని ఆలివ్ గ్రీన్ కలర్ లో ఉన్న చొక్కాను ఆయన షేర్ చేశారు.