వైసీపీ నేతలకు భయం అంటే నేర్పిస్తా – పవన్ కళ్యాణ్

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి వైసీపీ నేతలపై మండిపడ్డారు. అమరావతి లో ఏర్పటు చేసిన జనసేన విస్తృతస్థాయి సమావేశంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ వైసీపీ తీరుపై ఆగ్రహించారు. ఇంట్లో వారి కారణంగా ఇష్టం లేకున్నా సినిమాల్లోకి వచ్చానన్న పవన్.. సాటి మనిషికి అన్యాయం జరిగితే స్పందించే గుణం తనలో ఉందని తెలిపాడు. ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి గురించి మాత్రమే తాను మాట్లాడతానని, అభివృద్ధి కోసమే 2014లో తెదేపా, భాజపాకు మద్దతిచ్చామని గుర్తు చేశారు. రాష్ట్రంలో రోడ్లు వేయటానికీ ప్రభుత్వం వద్ద డబ్బుల్లేవని పవన్ ఆక్షేపించారు. రాష్ట్రంలో రూ.500 ఇస్తే ప్రెసిడెంట్ మెడల్ ఇస్తున్నారని నిజమైన ప్రెసిడెంట్ మెడల్ రావాలంటే యుద్ధాలు చేయాల్సిన పరిస్థితి తలెత్తిందని వ్యాఖ్యానించారు.

గ్రామసింహాలంటే.. కొన్ని నిఘంటువుల ప్రకారం.. ఎక్కువ వాగి పళ్లు రాలగొట్టించుకొనే కుక్కలు అంటూ పవన్ కామెంట్స్ చేశారు. వైసీపీ నేతలకు భయం అంటే నేర్పిస్తా.. కులాల చాటున దాక్కుంటే లాకొచ్చి కొడతా.. గుంటూరు బాపట్లలో పుట్టినవాడిని నాకు బూతులు రావా..? రాజకీయాల్లో ఉన్నాను కాబట్టి బూతులు మాట్లాడట్లేదు. నా వ్యక్తిగత జీవితం బ్లాక్ అండ్ వైట్, మీ వ్యక్తిగత జీవితాలు రంగులమయం’ అని పవన్ తెలిపారు. మా నాన్న సీఎం కాదు.. మా మామ సీఎం కాదు. మా నాన్న నాకు ఇడుపులపాయ లాంటి ఎస్టేట్ ఇవ్వలేదు. సాటి మనిషికి అన్యాయం జరిగితే స్పందించే గుణం ఉంది. యోగ మార్గంలోకి వెళ్లిన నన్ను.. బాధ్యతలు తప్పించుకుంటున్నావని అంటే తప్పని సరి పరిస్థితుల్లో సినిమాల్లోకి వచ్చాను. రాజకీయాల్లోకి మాత్రం ఇష్టంతో వచ్చాను’ అంటూ వైసీపీ నేతలను ఉద్దేశించి, పవన్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

కోడి కత్తి కేసు గురించి అడిగితే వైకాపా స్పందించిన తీరు దుర్మార్గంగా ఉందని వ్యాఖ్యానించారు. వివేకా హత్య కేసు గురించి అడిగితే ఎందుకు సమాధానం చెప్పలేదని ప్రశ్నించారు. వైకాపా అధినేత కూడా తన వ్యక్తిగతం గురించి మాట్లాడారన్న పవన్‌.. తన తలిదండ్రులు సంస్కారం నేర్పారని, వైకాపా వారిలా తాను మాట్లాడట్లేదని వివరించారు. వైకాపా నేతల ఇంట్లో ఆడవారిపై తప్పుగా మాట్లాడబోమని హామీ ఇస్తున్నట్లు చెప్పారు.