కార్తికేయ 2 ఫై పవన్ కామెంట్స్..సంబరాల్లో కార్తికేయ టీం

నిఖిల్ హీరోగా నటించిన కార్తికేయ 2 మూవీ దేశ వ్యాప్తంగా పలు భాషల్లో దుమ్ముదులుపుతుంది. ఇప్పటికే ఈ సినిమాపై పలువురు సినీ ప్రముఖులు స్పందించగా..తాజాగా సినీ నటుడు , జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించడం తో హీరో నిఖిల్ తో పాటు చిత్ర యూనిట్ సంబరాలు చేసుకుంటున్నారు.

జనసేన పార్టీ సమావేశంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ..కార్తికేయ చిత్ర ప్రస్తావనను తీసుకొచ్చారు. “కార్తికేయ’ అనే సినిమా వచ్చి దేశమంతా దుమ్ము దులిపేస్తోంది. నిఖిల్‌ అనే హీరో. నేను మార్పు రావాలని కోరుకుంటాను. ఇదే మార్పంటే..! ఇది మాది అనుకోవడానికి లేదు. అందరూ రావాలి” అంటూ పవన్‌కల్యాణ్‌ మాట్లాడిన వీడియో ఇప్పుడు వైరల్‌ అవుతోంది. ఈ వీడియోను నిఖిల్‌, అనుపమ పరమేశ్వరన్‌ సోషల్ మీడియాలో పంచుకుంటూ ఆనందంతో ఉబ్బితబ్బిబయ్యారు. ‘ఇంతకన్నా ఇంకేమైనా అవసరమా? థ్యాంక్స్‌ సర్‌.. ఇది చాలు మాకు’ అంటూ నిఖిల్‌ పోస్ట్ చేసారు.

ఇక కార్తికేయ 2 మూవీ ఆగస్టు 13న దేశ వ్యపథంగా పలు భాషల్లో విడుదలైంది. హిందీలో మొదటి రోజు 50 థియేటర్‌లలో విడుదలైన ఈ సినిమా ఇప్పుడు దాదాపు 1500లకు పైగా స్క్రీన్‌లపై ప్రదర్శితమవుతోంది. ఇప్పటివరకూ హిందీలో మొత్తం రూ.11.25 కోట్ల వసూళ్లు సాధించినట్లు సినీ విశ్లేషకుడు తరుణ్‌ ఆదర్శ్‌ పేర్కొన్నారు. తొలి రోజు కేవలం రూ.7లక్షలు వసూలు చేసిన సినిమా పది రోజుల్లో రూ.11కోట్లు వసూలు చేయడం విశేషం. మొత్తంగా ఇప్పటివరకూ ప్రపంచవ్యాప్తంగా వారం రోజుల షేర్ రూ.26 కోట్లు దాటింది. ఈ ట్రెండ్ ఇలాగే కొనసాగితే రూ.50కోట్లు వసూలు చేయడం పెద్ద విషయమేమీ కాదంటున్నారు సినీ విశ్లేషకులు. ఈ చిత్ర థియేట్రికల్ హక్కులను రూ.14 కోట్లకు విక్రయించగా, తొలి వారంలోనే డబుల్‌ షేర్‌ రాబట్టింది. దీన్ని బట్టి ఈ చిత్రం ఎంత పెద్ద హిట్టో అర్థం చేసుకోవచ్చు.

చందూ మొండేటి – నిఖిల్ కలయికలో 2014 లో వచ్చిన కార్తికేయ‌ చిత్రం ఎంత పెద్ద విజయం సాధించిందో చెప్పాల్సిన పనిలేదు. బాక్సాపీస్ వ‌ద్ద మంచి టాక్ మాత్రమే కాదు వసూళ్ల వర్షం కురిపించింది. ఈ చిత్రానికి సీక్వెల్ కార్తికేయ 2 వచ్చింది. అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ హీరోయిన్ గా శ్రీనివాస్ రెడ్డి కీలక పాత్ర‌లో నటించారు.