కందుకూరు ఘటన ఫై పవన్ దిగ్బ్రాంతి

నెల్లూరు జిల్లా కందుకూరులో విషాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆధ్వర్యంలో బుధవారం రాత్రి జరిగిన బహిరంగ సభకు భారీగా కార్యకర్తలు రావడంతో ఒక్కసారిగా తోపులాట జరిగింది. ఈ తోపులాటలో దాదాపు ఎనిమిది మంది మరణించారు. ఇక పదుల సంఖ్యలో గాయాలు కావడంతో హాస్పటల్ లో చికిత్స తీసుకుంటున్నారు. ఈ ఘటన పట్ల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దిగ్బ్రాంతి వ్యక్తం చేసారు.

కందుకూరులో టీడీపీ మీటింగ్ జరుగుతుండగా చోటు చేసుకున్న తొక్కిసలాటలో ఎనిమిది మంది మృతి చెందడం, మరి కొందరు ఆసుపత్రి పాలవడం చాలా దురదృష్టకరమన్నారు. ఏ పార్టీకైనా కార్యకర్తలే వెన్నుదన్ను. అటువంటి కార్యకర్తలు ఇలా ప్రమాదం బారినపడి మృతి చెందడం ఎంతో విచారకరమన్నారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధిస్తూ… వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నానని పవన్ తెలిపారు. ఆసుపత్రి పాలైన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు పేర్కొన్నారు.

ఇక ఘటన జరిగిన వెంటనే చంద్రబాబు సభను అర్ధాంతరంగా నిలిపివేసి హాస్పటల్ కు వెళ్లి బాధితులను పరామర్శించారు. జరిగిన సంఘటన పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేసిన ఆయన మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు. బాధితుల పిల్లలను ఎన్టీఆర్‌ ట్రస్టు విద్యాసంస్థల్లో ఉచితంగా చదివిస్తామని హామీ ఇచ్చారు.