ఎంఐ 17 వీ5 ఆర్మీ హెలికాప్టర్‌ ప్రమాదం ఫై దిగ్బ్రాంతి వ్యక్తం చేసిన పవన్

భారత సైన్యానికి చెందిన ఎంఐ 17 వీ5 ఆర్మీ హెలికాప్టర్‌ బుధవారం కోయంబత్తూరులోని కూనూర్ సమీపంలో కుప్పకూలింది. ఈ ప్రమాదంలో త్రివిద దళాల అధిపతి, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్(సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్ , ఆయన భార్య మధులిక రావత్ సహా మరో 11 మంది మృతి చెందారు. ఈ ఘటనపై దేశం మొత్తం దిగ్భ్రాంతికి లోనైంది. ఈ ప్రమాదం పట్ల సినీ, రాజకీయ ప్రముఖలంతా స్పందిస్తూ..నివాళ్లు అర్పిస్తున్నారు.

ఈ ఘటన పట్ల జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ స్పందించారు. ఆర్మీ హెలీకాప్టర్ కుప్పకూలిన దుర్ఘటనలో మన దేశ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్ మరణించడం తీవ్ర దిగ్భ్రాంతి కలిగిచింది. ఈ ఘటన అత్యంత బాధాకరం. అత్యున్నతమైన సీడీఎస్ బాధ్యతలను స్వీకరించిన తొలి అధికారి అయిన జనరల్ రావత్ దేశానికి అందించిన సేవలు శ్లాఘనీయం. త్రివిధ దళాలలను సమన్వయ పరిచి దేశ రక్షణ వ్యవస్థను పటిష్టపరిచే కీలక బాధ్యతల్లో ఉన్న ఆయన మృతి దేశానికి తీరని లోటు. జనరల్ రావత్, ఆయన సతీమణి శ్రీమతి మధులికలతో పాటు మరో పదకొండు మంది రక్షణ దళాల అధికారులు ఈ దుర్ఘటనలో మరణించడం దిగ్భ్రాంతిని కలిగించింది అంటూ పవన్ కళ్యాణ్ ఓ పత్రికా ప్రకటనను విడుదల చేసారు. అంతకు ముందు చిరంజీవి సైతం దిగ్బ్రాంతి వ్యక్తం చేయడం జరిగింది.