తలుపులు పగులకొట్టి మరీ లోపలకు వెళ్లి పట్టాభిని అరెస్ట్ చేసిన పోలీసులు

తెలుగుదేశం అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిని బుధవారం రాత్రి పోలీసులు అరెస్టు చేశారు. తలుపులు పగులకొట్టి మరీ లోపలకు వెళ్లి భారీ బందోబస్తు మధ్య అరెస్టు చేశారు. వైసీపీ సర్కార్ ఫై పట్టాభి చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేసారు. పెద్ద ఎత్తున కార్యకర్తలు పట్టాభి ఇంటికి చేరుకొని ఫర్నిచర్ ధ్వసం చేసి , బయట ఉన్న కార్లు ధ్వసం చేసారు. దీంతో పట్టాభి ఉదయం నుంచి బయటకు రాకుండా ఇంట్లోనే ఉన్నారు. తన ఇంటి వద్ద మధ్యాహ్నం వరకు పదిమంది ఉన్న పోలీసుల సంఖ్య సాయంత్రానికి ఒక్కసారిగా పెరగడంతో కచ్చితంగా అరెస్టు చేస్తారని పట్టాభి అనుమానించారు.

ఆయన అనుమానించినట్లే రాత్రి 9గంటల సమయంలో పోలీసులు పట్టాభి ఇంటి పరిసర ప్రాంతాలను పూర్తిగా ఆధీనంలోకి తీసుకొని అరెస్ట్ చేసారు. పట్టాభి వద్దకు వెళ్తున్న ఆయన భార్య చందనను మహిళా పోలీసులు అడ్డుకున్నారు. గవర్నరుపేట పోలీసులు ఇచ్చిన సీఆర్పీసీ 50(2) నోటీసును చందనకు అందజేశారు. అందులో పట్టాభిపై నమోదైన కేసులతో పాటు, ఆయనను అరెస్టు చేసి విజయవాడ మూడో ఏసీఎంఎం కోర్టులో హాజరుపర్చుతున్నట్టు పేర్కొన్నారు. అనంతరం భారీ కాన్వాయ్‌ మధ్య పట్టాభిని తోట్లవల్లూరు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. సీఎం జగన్‌పై పరుష పదజాలం ఉపయోగించినందుకు పట్టాభిపై క్రైం నం.352/2021తో ఐపీసీ 153(ఎం), 505(2), 353, 504 రెడ్‌విత్‌ 120(బి) సెక్షన్ల కింద గవర్నరుపేట పీఎ్‌సలో కేసు నమోదైంది. అరెస్ట్ కు ముందు పట్టాభి ఓ వీడియో విడుదల చేసారు. తన ఒంటిపై చిన్న గాయం కూడా లేదంటూ శరీర అవయవాలను చూపించారు. పోలీస్ కస్టడీలో తన ఒంటికి చిన్న గీత పడినా ముఖ్యమంత్రి జగన్, డీజీపీ బాధ్యత వహించాలని అన్నారు.