మోడీ పాట్న ర్యాలీలో పేలుళ్ల కేసు.. నలుగురికి ఉరిశిక్ష

గత నెల 27న 9 మందిని దోషులుగా తేల్చిన న్యాయస్థానం

పాట్నా: 2013లో బీహార్‌ రాజధాని పాట్నాలోని గాంధీ మైదానంలో ‘హుంకార్’ పేరుతో బీజేపీ భారీ ర్యాలీ చేపట్టింది. అప్పట్లో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న మోడీని బీజేపీ తమ ప్రధాన అభ్యర్థిగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఇక్కడ భారీ ర్యాలీ తలపెట్టారు. ర్యాలీ జరుగుతున్న సమయంలో బాంబు పేలుళ్లతో ఆ ప్రాంతం దద్దరిల్లింది. మొత్తం ఆరు బాంబులు పేలాయి. ఆరుగురు ప్రాణాలు కోల్పోగా, 70 మందికిపైగా గాయపడ్డారు. బాంబు పేలుళ్లలో ర్యాలీ కకావికలమైంది.

ఈ కేసును విచారిస్తున్న జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ప్రత్యేక న్యాయస్థానం గత నెల 27న 9 మందిని దోషులుగా తేల్చగా నిన్న తుదితీర్పు వెలువరించింది. మొత్తం 9 మందిని దోషిగా తేల్చిన కోర్టు వారిలో నలుగురికి ఉరిశిక్ష విధించింది. మిగిలిన వారిలో ఇద్దరికి జీవిత ఖైదు, మరో ఇద్దరికి పదేళ్లు, ఒకరికి ఏడేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. దోషుల్లో హైదర్ అలీ, నొమాన్ అన్సారీ, మహ్మద్ ముజీబుల్లా అన్సారీ, ఇంతియాజ్ ఆలంలకు ఉరిశిక్ష పడింది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/