ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ తల్లి కన్నుమూత

ఆస్ట్రేలియా క్రికెట్‌ జట్టు కెప్టెన్ పాట్ కమిన్స్ తల్లి మరియా కమిన్స్ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె చికిత్స తీసుకుంటూ ఈరోజు తుది శ్వాస విడిచారు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్‌లో ఉన్న పాట్ కమిన్స్.. తల్లి అనారోగ్యం కారణంగా రెండో టెస్టు ముగిసిన వెంటనే స్వదేశానికి వెళ్లాడు. మూడో టెస్టు నాటికి కమిన్స్ తిరిగి వస్తాడని భావించినప్పటికీ తల్లి ఆరోగ్యం విషమంగా ఉండడంతో అక్కడే ఉండిపోయాడు. కమిన్స్ తల్లి మరియా మృతికి క్రికెట్ ఆస్ట్రేలియా సంతాపం తెలిపింది. ఆమె మృతికి సంతాపంగా అహ్మదాబాద్‌లో జరుగుతున్న నాలుగో టెస్టు రెండోరోజు ఆస్ట్రేలియా ఆటగాళ్లు చేతికి నల్ల బ్యాండ్లు తగిలించుకుని మైదానంలోకి వచ్చారు. కమిన్స్‌కు, ఆయన కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్టు క్రికెట్ ఆస్ట్రేలియా పేర్కొంది.

బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో చివరిదైన నాలుగో టెస్టు అహ్మదాబాద్ వేదికగా జరుగుతోంది. తొలిరోజు బరిలోకి దిగిన ఆస్ట్రేలియా జట్టు బాగానే బ్యాటింగ్ చేసింది. 255/4 పరుగులు చేసి ఆకట్టుకుంది. తొలి రెండు టెస్టుల్లో విజయం సాధించిన భారత జట్టు.. మూడో మ్యాచులో ఓడిపోయింది. దీంతో ప్రస్తుతం జరుగుతున్న టెస్టు టీమిండియాకు చాలా కీలకం. ప్రస్తుతం కమిన్స్ లేకపోవడంతో.. స్టీవ్ స్మిత్ ఆస్ట్రేలియా జట్టుకు కెప్టెన్సీ చేస్తున్నాడు. మూడో టెస్టుకు కూడా సారథ్యం వహించిన స్మిత్.. ఆ మ్యాచ్ ని గెలిపించాడు. ఇప్పుడు నాలుగో టెస్టులో విజయం సాధించేలా కనిపిస్తున్నాడు.