పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు రద్దు

భారత్‌లో కరోనా వ్యాప్తి అదుపులోకి రాకపోవడంతో నిర్ణయం

Parliament of India
Parliament of India

న్యూఢిల్లీ: దేశంలో కరోనా వ్యాప్తి అదుపులోకి రాకపోవడంతో పార్ల‌మెంట్ శీతాకాల స‌మావేశాలను రద్దు చేసే అవకాశాలు కనపడుతున్నాయి. పార్లమెంటు సమావేశాలను నిర్వహించాలని కాంగ్రెస్ లోక్‌ సభాపక్ష నేత అధిర్ రంజన్ చౌదరి తాజాగా రాసిన లేఖకు కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పింది. కరోనా కారణంగా పార్లమెంటు సమావేశాలు రద్దు చేస్తున్నట్లు తెలుపుతూ అధిర్ రంజన్‌కు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి లేఖ రాశారు.

శీతాకాల పార్ల‌మెంట్ స‌మావేశాల‌ను ర‌ద్దు చేసేందుకు అన్ని పార్టీలు అంగీక‌రించాయని ప్ర‌హ్లాద్ జోషి అంటున్నారు. అన్ని పార్టీల నేత‌ల‌తో సంప్ర‌దింపులు జ‌రిపి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం జ‌న‌వ‌రిలో నేరుగా బ‌డ్జెట్ స‌మావేశాల‌ను నిర్వ‌హించ‌నున్న‌ట్లు సమాచారం.

కాగా, ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని ప్రకటించడం గమనార్హం. పార్లమెంటు సమావేశాలు జరిగితే ఈ విషయంపైనే ప్రధానంగా ప్రతిపక్ష పార్టీలు కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాలనుకున్నాయి. పార్లమెంటు శీతాకాల సమావేశాల రద్దుపై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.

అన్ని పార్టీలను సంప్రదించే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రహ్లాద్ జోషి చెబుతున్న విషయాన్ని కాంగ్రెస్ పార్టీ మాత్రం ఖండిస్తోంది. తమను కేంద్ర ప్రభుత్వం సంప్రదించలేదని చెబుతోంది. కాగా, రైతుల ఆందోళనతో పాటు కరోనా వ్యాక్సిన్ తయారీ, పలు అంశాలపై చర్చించడానికి శీతాకాల సమావేశాన్ని ఏర్పాటు చేయాలని ఇటీవల స్పీకర్ ఓం బిర్లాకు అధిర్ రంజన్ లేఖ రాశారు. దేశ ప్రజలు ఎదుర్కొంటోన్న సమస్యలను ప్రజలు అర్థం చేసుకోవాల్సి ఉందని, అందుకే శీతాకాల సమావేశాల‌ను అన్ని కరోనా నిబంధనలను పాటిస్తూ ఏర్పాటు చేయాలని కోరారు.

ప్రతి ఏడాది నవంబరు నెలాఖరున లేక డిసెంబరు మొదటి వారంలో శీతాకాల సమావేశాలు ప్రారంభమవుతాయన్న విషయం తెలిసిందే. వార్షిక బడ్జెట్ ను జనవరి చివరి వారంలో లేక ఫిబ్రవరి 1న కేంద్ర ప్రభుత్వం సాధారణంగా ప్రవేశపెడుతుంది. కరోనా విజృంభణ నేపథ్యంలో వర్షాకాల సమావేశాలను కుదించిన విషయం కూడా తెలిసిందే.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/