పార్లమెంట్‌లో విపక్షాల ఆందోళన.. లోక్ సభ సోమవారానికి వాయిదా
లోక్ సభలో కేంద్రాన్ని ప్రశ్నించిన విపక్ష సభ్యులు

న్యూఢిల్లీః పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. కాగా, నేడు లోక్ సభలో విపక్షాలు ఆందోళనకు దిగాయి. అదానీపై హిండన్ బర్గ్ నివేదిక కలకలం రేపుతున్న నేపథ్యంలో, విపక్ష సభ్యులు ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ప్రయత్నించారు. జేపీసీ, లేదా సీజేఐ పర్యవేక్షణలో దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేశారు. డౌన్ డౌన్ అంటూ కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దాంతో సభలో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ క్రమంలో సభను సోమవారానికి వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. విపక్ష నేతల తీరు పట్ల ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్యానికి విఘాతం అని వ్యాఖ్యానించారు. స్పీకర్ నిర్ణయం నేపథ్యంలో, ఇవాళ ఎలాంటి చర్చ జరగకుండానే సభ వాయిదా పడింది.