తెలంగాణలో ఇవి కూడా బంద్!

తెలంగాణలో ఇవి కూడా బంద్!

కరోనా మహమ్మారి కారణంగా యావత్ భారతేదశం ఎలా అల్లాడుతుందో మనం నిత్యం చూస్తూనే ఉన్నాం. ఈ వైరస్ నుండి ప్రజలను కాపాడేందుకు ఇప్పటికే పలు రాష్ట్రాల్లో లాక్‌డౌన్ అమలు చేశాయి అక్కడి ప్రభుత్వాలు. కాగా తెలంగాణ రాష్ట్ర సర్కార్ నైట్ కర్ఫ్యూ విధించింది. దీంతో రాత్రి వేళ ప్రజలు రోడ్లపై విచ్చలవిడిగా తిరగకుండా చూడాలని పోలీసులను ప్రభుత్వం ఆదేశించింది. అయితే ఇప్పటికే జనాలు గుమిగూడే థియేటర్లు మూతపడ్డ సంగతి తెలిసిందే.

తాజాగా జన సమూహం కనిపించే పబ్లిక్ పార్కులు, గార్డెన్స్‌లను కూడా మూసివేయాలని టీ-సర్కార్ ఆదేశించింది. జూ పార్కులు, టైగర్ రిజర్వ్‌లు, నేషనల్ పార్కుల్లో ప్రజలకు కరోనా వ్యాప్తి చెందకుండా ఉండేందుకు వాటిని మూసేస్తున్నట్లు అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. కేంద్రం ఇచ్చిన సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అటవీ శాఖ అధికారులు ప్రకటించారు. దీంతో హైదరాబాద్ నెహ్రూ జూ పార్క్, కేబీఆర్ పార్క్, వరంగల్ కాకతీయ జూ పార్క్, అమ్రాబాద్, కవ్వాల్ టైగర్ రిజర్వ్‌లలో సందర్శనలు నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

ఇక మే 2 తరువాత దేశవ్యాప్తంగా మరోసారి లాక్‌డౌన్ పెడతారనే వాదన ప్రజల్లో బలంగా వినిపిస్తోంది. ప్రధాని మోదీ మే 2న ఏం ప్రకటిస్తారని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. మరి నిజంగానే కరోనాను కట్టడి చేసేందుకు కేంద్రం మరోసారి లాక్‌డౌన్‌ను విధిస్తుందో లేదో చూడాలి.