మాకూ బీపీ వ‌స్తోంది..మేమేంటో చూపిస్తాం: ప‌రిటాల సునీత‌

మాలోనూ ప్రవహించేది సీమ రక్తమే..జ‌గ‌న్ ‘బీపీ’ వ్యాఖ్య‌ల‌పై ప‌రిటాల సునీత‌

హైదరాబాద్: త‌న‌ను తిడితే త‌న అభిమానుల‌కు బీపీ వ‌స్తుంద‌ని సీఎం జ‌గ‌న్ చేసిన వ్యాఖ్య‌ల‌పై టీడీపీ నాయ‌కురాలు ప‌రిటాల సునీత కౌంట‌ర్ ఇచ్చారు. టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు చేస్తోన్న దీక్ష నేప‌థ్యంలో ఆమె మాట్లాడుతూ… చంద్రబాబు నాయుడు మ‌ళ్లీ ఏపీ సీఎం అయ్యాక ఆయ‌న‌ గంట కళ్లు మూసుకుంటే తామేంటో చూపిస్తామని వైస్సార్సీపీ నేత‌ల‌ను హెచ్చ‌రించారు. త‌మ‌లోనూ ప్రవహించేది సీమ రక్తమేన‌ని అన్నారు.

తాము అధికారంలోకి వచ్చాక వైస్సార్సీపీ కి చుక్కలు చూపిస్తామని చెప్పారు. త‌మ‌కూ బీపీ వ‌స్తోందని, ఏం చేస్తామో చూడాల‌ని హెచ్చ‌రించారు. ఇన్నాళ్లూ తాము చాలా ఓపిగ్గా ఉన్నామ‌ని, ఇక‌పై ఓపికతో ఉండలేని పరిస్థితి ఏర్పడిందని ఆమె అన్నారు. గతంలో అధికారంలో ఉన్న స‌మ‌యంలో తాము పోలీస్ విభాగాన్ని వాడుకుంటే ఇప్పుడు వైస్సార్సీపీ రౌడీలు మిగిలి ఉండేవాళ్లు కాదని ఆమె చెప్పారు. త‌మ‌ పార్టీ ఏపీలో మ‌రోసారి అధికారంలోకి రావడం ఖాయమ‌ని ఆమె ధీమా వ్య‌క్తం చేశారు. తిట్లు త‌మకూ వ‌స్తాయ‌ని ఆమె చెప్పారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/