కూలిన పాపాగ్ని నది వంతెన..రాకపోకలు బంద్

కడప జిల్లాలో గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ వర్షాలు కురిసాయి. ఈ వర్షాల తాకిడికి అన్ని నదులు ఉప్పొంగిపోతున్నాయి. దీంతో ఎక్కడిక్కడే వంతెనలు , చెరువుల ఆనకట్టలు తెగిపోయాయి. శనివారం అర్ధరాత్రి కడప జిల్లా కమలాపురంలో పాపాగ్ని నదిపై ఉన్న వంతెన కూలిపోయింది. దీంతో రాకపోకలు బంద్ చేసారు. గత రెండు రోజులుగా వంతెన వద్ద ప్రమాదకరంగా ప్రవహిస్తోంది. నీరు అంచుల వరకు చేరడంతో నానిపోయిన వంతెన నిన్న సాయంత్రం నుంచి కొంచెంకొంచెంగా నానుతూ వస్తోంది. ఈ క్రమంలో అర్ధరాత్రి దాటిన తర్వాత ఒక్కసారిగా కుప్పకూలింది.

ఈ బ్రిడ్జి అనంతపురం నుంచి కడపకు వెళ్లే జాతీయ రహదారిపై ఉండడంతో వాహన రాకపోకలు నిలిచిపోయాయి. ఈ మార్గంలో వెళ్లాల్సిన వాహనాలను దారి మళ్లిస్తున్నారు. ఈ వంతెన పునరుద్ధరించేందుకు దాదాపు నెల రోజులు పడుతుందని అధికారులు చెపుతున్నారు. మరోపక్క పెన్నా నది ఉధృతి ఆగడం లేదు. తీర ప్రాంతంలో భయానక పరిస్థితులు ఏర్పడ్డాయి. వరద ముప్పు ప్రాంతాల్లో తాగునీటి కోసం జనాలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఇంకా 30 గ్రామాలు జలదిగ్బంధంలోనే చిక్కుకున్నాయి. పడుగుపాడు సమీపంలో వరద ప్రవాహానికి రోడ్డు పూర్తిగా ధ్వంసమయ్యింది. వర్షాల నేపథ్యంలో పలు రైళ్లు రద్దు కాగా, మరికొన్ని రైళ్లను దారి మళ్లించారు.